గుజరాత్‌ అల్లర్ల కేసులో..  దోషులకు సుప్రీం బెయిలు

– తీర్పుపై చర్చించాలన్న సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ, జనవరి23(జ‌నంసాక్షి) : గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లకు సంబంధించిన నరోడా పటియా ఊచకోత కేసులోని నలుగురు దోషులకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. కోర్టు ఈ నలుగురి శిక్షలపై సందేహం వ్యక్తంచేసింది. తీర్పుపై చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఉమేశ్‌భాయ్‌ భర్వాద్‌, రాజ్‌కుమార్‌, హర్షద్‌, ప్రకాశ్‌భాయ్‌ రాథోడ్‌ అనే నలుగురికి గుజరాత్‌ హైకోర్టు పదేళ్ల జైలు శిక్షను విధించింది. కాగా తాజాగా జస్టిస్‌ ఏఎం ఖాన్‌విల్కర్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వారికి బెయిలు మంజూరు చేసింది. శిక్షకు సంబంధించిన తీర్పును చర్చించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ట్రయల్‌ కోర్టు 29 మంది నిందితుల్లో 12 మందిని దోషులుగా తేల్చి శిక్ష విధించగా.. ఆ తీర్పును గత ఏడాది ఏప్రిల్‌ 20న గుజరాత్‌ హైకోర్టు సమర్థించింది. మరో 17 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. నిర్దోషుల్లో భాజపా మాజీ మంత్రి మాయా కొద్నానీ కూడా ఉన్నారు. 2002 ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని నరోడా పటియా ప్రాంతంలో జరిగిన ఊచకోతలో 97మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది మైనార్టీ వర్గానికి చెందిన వారు. గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ను దహనం చేసిన మరుసటి రోజు నరోడో పటియాలో అలర్లు చెలరేగాయి.