-->

చట్టాలతో రైతులకే మేలు – మోదీ

 

దిల్లీ,డిసెంబరు 12 (జనంసాక్షి): వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు మధ్య ఉన్న అడ్డుగోడలు నూతన సాగు చట్టాలతో తొలగిపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నూతన చట్టాలతో రైతులు కొత్త అవకాశాలు, మార్కెట్లు, ప్రత్యామ్నాయాలను అందిపుచ్చుకోనున్నారన్నారు. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులతో రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. ఫిక్కీ 93వ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ శనివారం ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓవైపు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ఆందోళన 17వ రోజూ కొనసాగుతోంది. కేంద్రం దిగిరాకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ తరుణంలో మోదీ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.కొత్త చట్టాల్లో పేర్కొన్నట్లుగా రైతులు తమ పంట ఉత్పత్తుల్ని వారి అభీష్టం మేరకు మండీల్లో లేదా బయట ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. త్వరలో శీతల గిడ్డంగులను ఆధునికీకరించనున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరగనున్నాయన్నారు. దీంతో రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచి.. వారి జీవితాల్ని మరింత సుభిక్షంగా మార్చాలన్న ఉద్దేశంతోనే కొత్త చట్టాల్ని తీసుకొచ్చామని తెలిపారు. రైతుల ప్రయోజనాల్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.రాజధాని సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళన ఇంకా కొనసాగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి వారిని చర్చలకు ఆహ్వానించింది. ఇప్పటికైనా ఉద్యమాన్ని విరమించి సంప్రదింపులకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘ చర్చల తర్వాతనే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని, ఇవి కచ్చితంగా రైతుల జీవితాల్లో మార్పు తెస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు చట్టాలను రద్దు చేయడం తప్ప, మరిదేనినీ అంగీకరించబోమని రైతు సంఘాలు భీష్మించుకు కూర్చున్నాయి. చట్టాలను ఉపసంహరించే వరకు ఇంటికెళ్లేది లేదని తేల్చి చెబుతున్నాయి.