చనిపోయినా..  వారిని బయటకు తీసుకురండి


– సహాయక చర్యల కోసం ఆర్మీని ఎందుకు కోరలేదు?
– మేఘాలయ గనిలో సహాయకచర్యలపై సుప్రీం అసంతృప్తి
న్యూఢిల్లీ, జనవరి3(జ‌నంసాక్షి) : మేఘాలయ బొగ్గు గనిలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించడంలో చేపట్టిన సహాయక చర్యలపై సుప్రింకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మికులను కాపాడే విషయమై దాఖలఐన పిటీషన్‌పై న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. గనిలో చిక్కుకున్న కార్మికులు ప్రాణాలతో బయటపడాలని ప్రార్ధించిన కోర్టు.. వారిని కాపడేందుకు చేపట్టిన సహాయక చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గనిలో చిక్కుకుపోయిన కార్మికులు చనిపోయినా సరే వారి మృతదేహాలను బయటకు తీసుకురావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘సహాయకచర్యలపై మేం సంతృప్తిగా లేంమని, ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది. జీవన్మరణ సమస్య. కార్మికులు చిక్కుకుని చాలా రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వం సహాయకచర్యల కోసం ఆర్మీని ఎందుకు కోరలేదని, కార్మికులు బతికున్నా..
చనిపోయినా సరే వారిని బయటకు తీసుకురావాలని సూచించింది. గనిలో చిక్కుకున్న కార్మికుల విషయంలో ప్రతి నిమిషం విలువైనదని.. వారిని బయటకు తెచ్చేందుకు తక్షణ, సమర్థమైన సహాయకచర్యలు అవసరమని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఈ విషయాన్ని తక్షణమే పరిశీలించాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించింది. కార్మికులను బయటకు తెచ్చేందుకు చేపట్టిన చర్యలపై నివేదికను శుక్రవారం కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. మేఘాలయలోని తూర్పు జయంతియా జిల్లాలో డిసెంబరు 13న 15 మంది కార్మికులు బొగ్గు గనిలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దట్టమైన చెట్లతో కూడి ఉన్న కొండపై ఉండే ఎలుక బొరియల్లో అక్రమంగా బొగ్గు తవ్వేందుకు కూలీలు లోపలికి వెళ్లగా.. పక్కనే ప్రవహిస్తున్న లిటిల్‌ నది నీరు గనిలోకి ముంచెత్తడంతో 15 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. వీరిలో కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, వైమానిక దళం, అగ్నిమాపక దళం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఘటన జరిగి 22 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కార్మికుల ఆచూకీ తెలియలేదు. కార్మికులు చనిపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.