చరిత్ర సృష్టించిన చైనా

– చంద్రుడి వెనుకభాగంలో దిగిన చైనా వ్యోమనౌక
బీజింగ్‌, జనవరి3(జ‌నంసాక్షి) : జాబిలి వెనుక వైపు దిగిన తొలి వ్యోమనౌకగా చైనా చరిత్ర సృష్టించింది. డిసెంబరు 8న చైనా ఈ వ్యోమనౌకను ప్రయోగించగా గురువారం అది విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పటి వరకు చంద్రుడి అవతలి వైపు ప్రాంతానికి అమెరికా, రష్యా సహా ఎవరూ వెళ్లలేదు. అలాంటి చోట చైనా అడుగుపెట్టి గొప్ప విజయం సాధించింది. చాంగె-4 చంద్రుడి విూద దిగి ఫొటోలు పంపినట్లు చైనా వెల్లడించింది. చాంగె-4లో ల్యాండర్‌, రోవర్‌ ఉన్నట్లు తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 10.26 సమయానికి వ్యోమనౌక చంద్రుడిపై నిర్దేశిత ప్రాంతంలో దిగిందని చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్టేష్రన్‌ వెల్లడించింది. వ్యోమనౌకను లాంగ్‌ మార్చ్‌-3బీ రాకెట్‌ ద్వారా డిసెంబరు 8న నింగిలోకి పంపింది. చంద్రుడిపై దిగిన రోవర్‌ దానిలోని ఓ మానిటర్‌ కెమెరా నుంచి అది దిగిన ప్రదేశాన్ని ఫొటో తీసి పంపించింది. చంద్రుడి వెనుక వైపున తొలి ఫొటో ఇది. ఈ ఫొటోను చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్టేష్రన్‌ ప్రచురించింది. భూమికి ఎదురుగా ఉండే చంద్రుడి భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ వెనుక వైపు కనిపించదు. భూమి ఎలాగైతే గుండ్రంగా తిరుగుతుందో.. చంద్రుడు కూడా అలాగే గుండ్రంగా తిరుగుతాడు. అయితే ఎప్పుడూ చందమామ ఒకవైపు మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు కనిపించదు. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఏ వ్యోమనౌకా సురక్షితంగా దిగలేదు. అందువల్ల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడానికి సాధ్యపడలేదు. ఇప్పుడు చైనా అక్కడ వ్యోమనౌకను దింపడంతో పరిశోధనలకు మార్గం సుగమమైంది.