చలానాతో ఉచితంగా హెల్మెట్‌!

– ద్విచక్రవాహన చోదకులకు బంపర్‌ ఆఫర్‌
జైపూర్‌, సెప్టెంబర్‌5  (జనం సాక్షి ):

ద్విచక్రవాహన చోదకులకు రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. హెల్మెట్‌ లేకుండా ద్విచక్రవాహనం నడిపిన చోదకులకు ట్రాఫిక్‌ పోలీసులు వెయ్యిరూపాయల చలానా విధించి, అది చెల్లించిన వారికి ఉచితంగా ఐఎస్‌ఐ మార్కు ఉన్న ఓ హెల్మెట్‌ ను ఉచితంగా ఇవ్వాలని రాజస్థాన్‌ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మోటారువాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వాహనచోదకులకు భారీ జరిమానాలు విధించమని రాజస్థాన్‌ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి ప్రతాప్‌ సింగ్‌ చెప్పారు. రాజస్థాన్‌ ప్రజల సెంటిమెంటును పరిగణనలోకి తీసుకొని హెల్మెట్‌ ధరించకుండా ద్విచక్రవాహనాలు నడిపిన వారినుంచి వెయ్యిరూపాయల చలానా విధించి, వారికి ఐఎస్‌ఐ మార్కు ఉన్న హెల్మెట్‌ ను ఉచితంగా అందిస్తామని మంత్రి ప్రకటించారు. రోడ్డు భద్రతపై వాహనచోదకులను చైతన్యవంతులను చేసేలా ప్రాథమికంగా నామమాత్రపు చలానాలు విధించాలని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారని మంత్రి చెప్పారు. హెల్మెట్‌ లేకుండా ద్విచక్రవాహనం నడిపితే వందరూపాయలున్న జరిమానాను వెయ్యిరూపాయలకు పెంచి, చలానా విధించి, ఆ మొత్తాన్ని చెల్లించిన వారి భద్రత కోసం ఉచితంగా హెల్మెట్‌ అందజేస్తామని మంత్రి వివరించారు. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం భారీ జరిమానాల విధింపు విషయంలో రాజస్థాన్‌ సర్కారు తొందర పడటం లేదని మంత్రి చెప్పారు.