చిదంబరం, కార్తి చిదంబరానికి ఊరట!

– ఆగస్టు 1వరకు అరెస్టు నుంచి మినహాయింపు
– తీర్పునిచ్చిన ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ, మే30(జ‌నంసాక్షి) : ఎయిర్‌సెట్‌ మ్యాక్సిస్‌ కేసులో మాజీ కేంద్ర మంత్రి చిందబరం, కార్తి చిదంబరానికి మరోసారి ఊరట లభించింది. అరెస్టు నుంచి మినహాయింపు ఆగస్టు 1వ తేదీ వరకు పొడగిస్తూ ఢిల్లీ కోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఎయిర్‌సెల్‌ – మ్యాక్సిస్‌ మనీ లాండరింగ్‌ పీ చిదంబరంను ఎ1 నిందితుడిగా పేర్కొంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చిదంబరంతోపాటు భాస్కరామన్‌, నాలుగు మాక్సిస్‌ కంపెనీలు సహా 9 మందిని నిందితులుగా ఈ సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. నవంబర్‌ 26న ఈ చార్జిషీటును విచారణకు స్వీకరించనున్నట్లు సీబీఐ స్పెషల్‌ కోర్టుజడ్జి ఓపీసైనీ చెప్పారు. అయితే ఈ కేసులో చిదంబరంను అరెస్ట్‌ చేయకూడదంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిజానికి అక్టోబర్‌ 25వరకే ఉన్నా.. మరోసారి దానిని పొడిగించింది. సీబీఐ, ఈడీలు తనను అరెస్ట్‌ చేయకుండా చిదంబరం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఐఎన్‌ఎక్స్‌ విూడియాకు ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు క్లియరెన్స్‌ కేసులో చిదంబరంతోపాటు ఆయన తనయుడు కార్తీలపై సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్నది. ఈ అక్రమాలు 2007లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో జరిగాయి. ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందానికి ఎఫ్‌ఐపీబీ ఆమోదం లభించడంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.