చిదంబరానికి సిబిఐ కస్టడీ పొడిగింపు

– 2వ తేదీవరకు విచారణకు అవకాశం
న్యూఢిల్లీ,ఆగస్టు 30(జనంసాక్షి):ఐఎన్‌ఎక్స్‌ విూడియా అవినీతి కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం మరోసారి పొడిగించింది. సెప్టెంబర్‌ 2వ తేదీ వరకూ సీబీఐ రిమాండ్‌ను పెంచుతూ ఆదేశాలిచ్చింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఇప్పటికీ ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించింది. అయితే కస్టడీ గడవు శుక్రవారంనాడు ముగియడంతో రౌస్‌ ఎవెన్యూ కోర్టు ముందు చిదంబరంను శుక్రవారం హాజరు పరిచారు. చిదంబరంను తాము ఇప్పటికే ప్రశ్నించామని, అయితే ఆయన సరిగా విచారణకు సహకరించడం లేదని, ఎగవేత సమాధానాలు ఇస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. మరో నాలుగురోజుల పాటు కస్టడీని పొడిగించాలని సీబీఐ కోరింది. దీంతో సెప్టెంబర్‌ 2 వరకూ కస్టడీ పొడిగించేందుకు ప్రత్యేక కోర్టు అంగీకరించింది. దీంతో చిదంబరంను తిరిగి సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు  తరలించారు. గత వారం నాటకీయ పరిణామాల మధ్య చిదంబరంను ఆయన ఇంటిలో అదుపులోకి తీసుకోగా, సీబీఐ కస్టడీలో ఉంచి, విచారించేందుకు న్యాయస్థానం అనుమతించింది.