చెట్ల నరికివేత అక్రమం కాదు..

– ఈ మేరకు బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది
– కొందరు తమనుతాము ఉన్నతమైన న్యాయవ్యవస్థగా భావించటం సరికాదు
– పర్యావరణ కార్యకర్తలపై మంబయి మెట్రో చీఫ్‌ ఆగ్రహం
ముంబయి, అక్టోబర్‌ 5 (జనంసాక్షి): ముంబైలోని ఆరే కాలనీలోని దాదాపు 3వేల చెట్లను నరికేయడం అక్రమం కాదని ముంబై మెట్రో చీఫ్‌ అశ్వినీ భిడే తెలిపారు. చెట్లను నరికివేసేందుకు అనుమతి ఇవ్వడం, నరికివేసే సమయం మధ్య 15రోజుల తప్పనిసరి నోటీసు వ్యవధి లేదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్‌ లు చేశారు. ట్రీ అథారిటీ ఆర్డర్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ అయిన తర్వాత 15రోజుల నోటీసు అవసరమని తప్పుడు ప్రచారం జరుగుతందని, ఇది ఖచ్చితంగా నిరాధారమైనదని ఆమె ఓ ట్వీట్‌ లో తెలిపారు. ట్రీ అథారిటీ ఉత్తర్వు సెప్టెంబర్‌ 13న జారీ
చేయబడిందని, సెప్టెంబర్‌ 28 నాటికే 15 రోజులు గడిచిపోయినప్పటికీ గౌరవ హైకోర్టు తీర్పు వెలువడే వరకు చర్యలు కోసం ఎదురుచూసినట్లు ఆమె తెలిపారు. అరే కాలనీలో మెట్రో కార్ల షెడ్‌ కోసం చెట్ట నరికివేతను సవాల్‌ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను శుక్రవారం బాంబే హైకోర్టు అన్ని స్పష్టమైన నిబంధనలతో తోసిపుచ్చిందని, కానీ కొంతమంది ప్రజలు తమను తాము ఉన్నతమైన న్యాయవ్యవస్థగా భావిస్తారని ఆమె తెలిపారు. వారి స్వంత చర్యలు చట్టవిరుద్ధమని ఆమె తెలిపారు. కోర్టులో జరిగిన యుద్ధంలో ఓడిపోతే, దానిని వీధికి తీసుకెళ్లడం కంటే గౌరవంగా అంగీకరించడం మంచిదని చెట్ల నరికివేతను అడ్డుకుంటున్నవారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అరే కాలనీలో కార్ల షెడ్డును నిర్మించాలని ముంబై మెట్రో తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణ కార్యకర్తలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు చెట్ల నరికివేత అడ్డుకోవాలంటూ హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం పిటిషన్లను విచారించిన హైకోర్టు వాటిని కొట్టివేసింది. దీంతో శుక్రవారం రాత్రి కొన్ని చెట్లను తొలగించేందుకు మున్సిపల్‌ అధికారులు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ విూడియాలో వైరల్‌ కావడంతో పర్యావరణ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బుల్డోజర్లకు అడ్డుగా నిలబడి శాంతియుతంగా నిరసన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టి అదుపులోకి తీసుకున్నారు.  మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ ముంబై నిబంధనల ప్రకారం కోర్టు ఆర్డర్‌ వెబ్‌సైట్‌లో పెట్టిన 15రోజుల తర్వాతే చెట్లు నరికివేసే వీలుంటుందని పర్యావరణ కార్యకర్తలు చెబుతున్నారు. కానీ మెట్రో అధికారులు మాత్రం అర్ధరాత్రి అత్యుత్సాహం ప్రదర్శించి చెట్లను నరికివేయడం దారుణమన్నారు. అయితేచెట్లను నరికివేయడాన్ని రాజకీయనాయకులు, బాలీవుడ్‌ ప్రముఖులు,సెలబ్రిటీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శనివారం ముంబైలోని ఆరే కాలనీలో 144 సెక్షన్‌ విధించారు. అరే ప్రాంతంలో అధికారులు చెట్ల నరికివేత కొనసాగిస్తున్నారు. దీనిని అడ్డుకునేందుకు శనివారం ఉదయం ప్రయత్నించిన పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అయిన వారిలో శివసేన లీడర్‌ ప్రియాంక చతుర్వేది కూడా ఉన్నారు. వీరు చెట్ల నరికివేతను అడ్డుకోవటాన్ని ముంబై మెట్రో చీఫ్‌ అశ్వినీ భిడే ఖండించారు.