ఛత్తీస్‌గఢ్‌లో కొలువు దీరిన మంత్రివర్గం

– మంత్రులుగా తొమ్మిది మంది ప్రమాణస్వీకారం
రాయ్‌పూర్‌, డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : ఛత్తీస్‌గఢ్‌లో మంత్రివర్గం కొలువుదీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్‌ నేత భూపేశ్‌ భగేల్‌ మంగళవారం మంత్రివర్గాన్ని విస్తరించారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ వీరిచే ప్రమాణం చేయించారు. వీరిలో ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మహిళా ఎమ్మెల్యే కూడా ఉన్నారు.  ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మహ్మద్‌ అక్బర్‌, రవీంద్ర చౌబే, జైసింగ్‌ అగర్వాల్‌, ఉమేశ్‌ పటేల్‌, అనిలా బేడీయా, కవాసీ లక్ష్మా, ప్రేం సాయి సింగ్‌, తేక్కం, శివకుమార్‌ దహారియా, రుద్ర గురులు ఉన్నారు. అయితే ఈనెల 17న ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా భూపేశ్‌ బఘెల్‌ ప్రమాణస్వీకారం చేసిన విషయం విధితమే. బఘెల్‌తో పాటు నాడు ఇద్దరు ఎమ్మెల్యేలే సింగ్‌ దేవ్‌, తామ్రధ్వజ్‌ సాహులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో భూపేశ్‌ బఘెల్‌ కేబినెట్‌ 12మందికి చేరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 90నియోజకవర్గాలున్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ 68 స్థానాల్లో గెలుపొందింది. 15ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భాజపా కేవలం 15 స్థానాలకే పరిమితమైంది. నూతన ముఖ్యమంత్రిగా భూపేశ్‌ భగేల్‌ డిసెంబరు 17న ప్రమాణస్వీకారం చేశారు. అదే రోజు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మూడింట విజయం సాధించింది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో భాజపా నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. డిసెంబరు 17నే ఈ మూడు రాష్ట్రాల్లో నూతన ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. రాజస్థాన్‌లో సీఎం అశోక్‌ గ¬్లత్‌ 23 మందితో సోమవారం కేబినెట్‌ను ఏర్పాటుచేశారు. ఇక మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ మంత్రివర్గాన్ని విస్తరించాల్సి ఉంది.