జమ్ముకశ్మీర్‌ని వణికిస్తోన్న చలి

– 11ఏళ్లలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు
– స్తంభించిన జనజీవనం
జమ్మూకాశ్మీర్‌, డిసెంబర్‌29(ఆర్‌ఎన్‌ఎ) : చలి గాలులు కశ్మీర్‌ని వణికిస్తున్నాయి. 11 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రముఖ పర్యాటక స్థలం దాల్‌ సరస్సుతోపాటు ఇతర సరస్సులు పూర్తిగా గడ్డ కట్టాయి. పైపులైన్లలో కూడా నీళ్లు గడ్డ కట్టడంతో ఇళ్లకు నీటి సరఫరా నిలిచిపోయింది. చలిగాలులు, మంచు దెబ్బకు చాలా జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. లోయలో మంచు దెబ్బకు వాహనాల రాకపోలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చల్లటి గాలులతో చిన్నపిల్లలు, సీనియర్‌ సిటిజన్లు వణుకుతున్నారు. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. కశ్మీర్‌ చుట్టూ మంచుకొండలు ఉండడంతో వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. వింటర్‌ వస్తే ఇక అంతే సంగతి. అయితే గత దశాబ్ధ కాలంలో లేనంతగా ఈ సారి అక్కడ చలి చంపేస్తోంది. శీతల గాలులతో కశ్మీరం వణికిపోతోంది. గడ్డ కట్టిన సరస్సులపై క్రికెట్‌ ఆడుతూ ఎంజాయ్‌ చేశారు కశ్మీరీలు. ఇక కశ్మీర్‌లో
ప్రస్తుతం ఉన్న సమయాన్ని చిల్లాయి కలాన్‌ అంటారు. ఈ టైంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 40 రోజుల పాటు ఉండే ఈ వాతావరణం జనవరి 31తో ముగుస్తుంది. ఆ తర్వాత 20 రోజుల పాటు చిల్లా ఖుర్ద్‌, పది రోజుల పాటు చిల్లాయ్‌ బచ్చా ఉంటాయి.