జెడిఎస్‌తో పొత్తును సమర్థించుకున్న కాంగ్రెస్‌

ప్రభుత్వం కూలినందుకు చింత లేదన్న శివకుమార్‌
అసమ్మతి ఎమ్మెల్యేల తీరే బాధించిందన్న డికె
బెంగళూరు,జులై24(జ‌నంసాక్షి): జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినందుకు తామేవిూ చింతించడం లేదని కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ అన్నారు. కూటమి ప్రభుత్వంలో తామెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశామని తెలిపారు. అయినా కొందరు పార్టీకి వెన్నుపోటు పొడిచారని అన్నారు. కర్నాటకలో జెడిఎస్‌తో కలసి ప్రభుత్వం ఏర్పాఉట చేయడంలో  మా నిర్ణయం సరైందే అన్నారు.  ఇక అధిష్ఠానం ఏది చెప్తే అదే చేస్తాను. ప్రతిపక్షంలో కూర్చోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంటీబీ నాగరాజుకు టికెట్‌ నా వల్లే ఇచ్చారు.
కాంగ్రెస్‌- జేడీఎస్‌ కూటమిలో రాజుకున్న అసమ్మతి కారణంగా ప్రభుత్వం కూలిపోగా, దదానిపై ఆయన స్పందించారు.  మంగళవారం కర్ణాటక అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో కూటమి సర్కారు ఆరు ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. కనీసం ఐదు మంది ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించలేకపోయానన్న బాధను వ్యక్తం చేశారు. నా స్నేహితులుగా ఉన్న ఎమ్మెల్యేలే నన్ను వెన్ను పోటు పొడిచారు. నాకే కాదు భాజపాకి కూడా వెన్ను పోటు తప్పదని శివకుమార్‌ హెచ్చరించారు. తమను కాదనుకున్న వారు రేపు ఇతరులతో కూడా అలా ఉండరని గ్యారెంటీ లేదన్నారు. కూటమి ప్రభుత్వానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రెండు వారాల క్రితం రాజీనామా చేశారు. వారిని వెనక్కి రప్పించాలని డీకే శివకుమార్‌ విశ్వప్రయత్నాలు చేశారు. ముంబయిలో అసమ్మతి ఎమ్మెల్యేలు తలదాచుకున్న ¬టల్‌కు వెళ్లి వారిని కలిసేందుకు ఎంతో శ్రమించారు. ఎంటీబీ నాగరాజు తన మద్దతును ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ యూటర్న్‌ తీసుకున్నారు. బల పరీక్ష జరిగే ఆఖరి క్షణం వరకు డీకే శివకుమార్‌ ఎంతో పోరాడారు. కానీ ఆయన ప్రయత్నం వృథా అయింది. దీంతో సాటి ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. విశ్వాసం లేని చోట ఇలాంటి పరిస్థితి వస్తుందన్నారు.
బిఎస్పీ ఎమ్మెల్యేపై వేటు
కర్ణాటకలో అసెంబ్లీలో మంగళవారం రాత్రి జరిగిన విశ్వాస పరీక్షపై ఓటింగ్‌కు దూరంగా ఉన్న బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు పడింది. ఎమ్మెల్యే మహేశ్‌ను పార్టీ నుంచి బీఎస్పీ అధినేత్రి మాయావతి సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సమయంలో గైర్హాజరు కావడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ సంకీర్ణ కూటమికి అనుకూలంగా ఓటు వేయాలని పార్టీ ఆదేశించింది. అయితే, పార్టీ ఆదేశాలను ఆయన ఉల్లంఘించడంతో క్రమశిక్షణ చర్యల కింద మహేశ్‌ను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్టు వెల్లడించారు.