టాటా స్టీల్‌ భూములు మళ్లీ రైతులకే… ఛత్తీస్‌గడ్‌ సీఎం భూపేష్‌ బఘెల్‌ 

ఈ నిర్ణయం చరిత్రాత్మకమైనది: కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు
రాయ్‌పూర్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): ఎన్నికల మేనిఫెస్టేలో ఇచ్చిన హావిూల అమల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. టాటా స్టీల్‌ ప్రాజెక్టు కోసం గిరిజన రైతుల నుంచి సేకరించిన భూములను వెనక్కి తీసుకునే పక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే రైతు రుణాల మాఫీని ప్రకటించిన ముఖ్యమంత్రి భూపేష్‌ బఘెల్‌ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భూములను వెనక్కి తీసుకునేందుకు అవసరమైన పక్రియ, విధివిధానాలపై వచ్చే క్యాబినెట్‌ సమావేశంలోగా నివేదిక అందించాలని అధికారులను ముఖ్యమంత్రి మంగళవారంనాడు ఆదేశించారు.భూసేకరణ జరిపిన ఐదేళ్ల లోగా ప్రాజెక్టు నిర్మాణం జరగని పక్షంలో ఆ భూములను స్వాధీనం చేసుకుని సొంతదారులకే అప్పగిస్తామని అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ఇటీవల హావిూ ఇచ్చింది. రాహుల్‌ గాంధీ సైతం బస్తర్‌ ప్రచార సభలో ఈ విషయమై చాలా స్పష్టమైన హావిూ ఇచ్చారు.బస్తర్‌ జిల్లా లోహండిగూడ ప్రాంతంలో రూ.19,600 కోట్ల ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం 2005లో బీజేపీ ప్రభుత్వం టాటా స్టీల్‌ ప్లాంట్‌తో ఎంఓయూపై సంతకాలు చేసింది. గిరిజనులకు సంబంధించిన భూముల సేకరణ 2008లో ప్రారంభమైంది. 10 గ్రామాల నుంచి 1,764 హెక్టార్ల భూములను సేకరించింది. భూసేకరణ పక్రియపై అంసతృప్తులు తలెత్తడం, రైతుల్లో విస్తృత చర్చ జరగడంతో హక్కుల కార్యకర్తలు ఆందోళనలు చేశారు. 1,707 మంది రైతుల్లో 1,165 మంది రైతులు నష్టపరిహారానికి అంగీకరించారు. అయితే 2016 నాటికి కూడా ప్రభుత్వం భూమి స్వాధీనం చేసుకోకపోవడంతో ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని టాటా స్టీల్‌ ప్రకటించింది. నిరసనలు, విధానపరమైన జాప్యాలు, మావోయిస్టుల హెచ్చరికలు వంటి కారణాలను అధికారులు ఉటంకిస్తూ వచ్చారు. అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌…రైతుల భూములు రైతులకే తిరిగిచ్చేయాలని డిమాండ్‌ చేసింది. అయితే బీజేపీ ప్రభుత్వం మాత్రం సేకరించిన భూమిని పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే ల్యాండ్‌ బ్యాంకుకే అప్పగిస్తామని తెగేసి చెప్పింది.అయితే ఈ క్రమంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఎన్నికల హావిూకి అనుగుణంగా టాటా స్టీల్‌ భూములను వెనక్కి తీసుకుని రైతులకు అప్పగించేందుకు నిర్ణయిస్తూ భూపేష్‌ బఘెల్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సర్కార్‌ తాజా నిర్ణయం ద్వారా నక్సల్స్‌ అంశాన్ని ప్రజానుకూల విధానాలతో సమర్ధవంతంగా ఎదుర్కోగలమనే స్పష్టమైన సంకేతాలిచ్చినట్టు సీఎం విూడియా సలహాదారు రుచిర్‌ గర్క్‌ తెలిపారు.