ఢిల్లీని కమ్మేసిన కారుమేఘాలు


– దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
– గజగజలాడుతున్న రాజధాని వాసులు
– పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం
న్యూఢిల్లీ, జనవరి22(జ‌నంసాక్షి) : దేశరాజధాని ఢిల్లీని దట్టమైన కారుమేఘాలు కమ్మేసాయి. శీతాకాలం పొగమంచుకుతోడు ఉత్తరాదిన పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతానికి సోమవారం రాత్రి నుంచి జడివాన కురుస్తుంది. చిరుజల్లులకు తోడు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో దేశ రాజధాని ప్రజలు గజగజలాడిపోతున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్‌ ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది. పంజాబ్‌, చండీగఢ్‌, ఉత్తరాఖండ్‌లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు హిమాచల్‌ ప్రదేశ్‌లో సిమ్లా సహా కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన మంచు కురిసింది.  వాహనాలు, రోడ్లపై మంచు దట్టంగా పరుచుకుంది. ఉదయం నుంచి కురుస్తున్న జల్లుల కారణంగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం ఉదయం ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులతో కారు మబ్బులు కమ్మేసి వడగండ్ల వాన కురిసింది. వర్షంతో పాటూ కారు మబ్బులు నగరాన్ని అలముకున్నాయి. పట్ట పగలు చీకటి కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కన్పించకపోవడంతో అక్కడక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఉదయం 9గంటల సమయంలోనూ చీకటితో రాత్రిని తలపించింది. వర్షందెబ్బకు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగ్గా.. 15 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఢిల్లీతో పాటూ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురవగా.. వర్షానికి తోడు చలి దెబ్బకు జనాలు వణికిపోతున్నారు.  మరోవైపు ఢిల్లీతో పాటూ పంజాబ్‌, చండీగఢ్‌, ఉత్తరాఖండ్‌లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం..
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇది దక్షిణ బంగాళాఖాతాన్ని ఆనుకుని హిందూమహాసముద్రం విూదుగా ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఆగ్నేయ ప్రాంతంలో అండమాన్‌ వద్ద ఏర్పడిన ద్రోణి అల్పపీడనంగా మారినట్టు వివరించారు. సముద్రమట్టానికి 3.1 కిలోవిూటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి ఈ అల్పపీడనం ఉందని వారు వివరించారు. దీని ప్రభావంతో జనవరి 25న ఆంధప్రదేశ్‌లోని అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని
అధికారులు వెల్లడించారు. ఆప్ఘనిస్థాన్‌ విూదుగా సాగుతోన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర భారత దేశంలో మంచు ప్రభావం అధికంగా ఉంది. దీని ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగింది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగినా రాత్రివేళలో మాత్రం కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.
రాయలసీమలో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయింది. జనవరి 19న శనివారం ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, ఏపీలోని అత్యల్పంగా ఆరోగ్యవరంలో 13 డిగ్రీలు, అనంతపురం, తిరుపతి, నంద్యాల, విశాఖ, జంగమహేశ్వరపురంలలో 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్పపీడనం వల్ల తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలిపింది. రాష్ట్రంలో పగటిపూట పొడి వాతావరణం, రాత్రి వేళలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.