ఢిల్లీ పోలీసులపై షిండేకు షీలాదీక్షిత్ ఫిర్యాదు
న్యూఢిల్లీ, డిసెంబర్ 25 (జనంసాక్షి):
ఢిల్లీలో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరు బాధ్యతారహితంగా ఉందంటూ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు మంగళవారం ఫిర్యాదు చేస్తూ ఉత్తరం రాశారు. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై విచారణ జరిపించాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఉషామేహ్రా నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటు అయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో షీలాదీక్షిత్ ఉత్తరం రాయడం సంచలనం కలిగించింది. ఈ ఘటనపై కమిటీ పోలీసు శాఖలో ఉన్నత స్థాయి అధికారులను విచారించి వారి వాదనలను కమిటీ నమోదు చేసుకుంది. ఇదిలా ఉండగా శనివారం నాడు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ బాధితురాలి నుంచి వాంగ్మూలం స్వీకరించారు. ఈ బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలానికి, పోలీసులు ఇచ్చిన నివేదికకు పొంతన లేకపోవడం గమనార్హం. దీనిపై ఉన్నత స్థాయి అధికారులు పోలీస్ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. బాధితురాలి నుంచి వాంగ్మూలం స్వీకరించిన తరువాత క్రమక్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. సోమవారం నాటి వరకు వెంటిలేటర్‌పైనే ఉన్న బాధితురాలు తెల్లరక్త కణాల సంఖ్య 19వేల నుంచి 17వేలకు పడిపోయింది.