తమిళనాడుకు మద్దతు ఇవ్వండి


కేరళ సిఎంకు కమలహాసన్‌ లేఖ
చెన్నై,నవంబర్‌27(జ‌నంసాక్షి): తమిళనాడులో ‘గజ’ తుపాను ధాటికి 63 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా,తుపాను ప్రభావంతో చాలా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు
చక్కదిద్దేందుకు మద్దతు తెలపాలని కోరుతూ సినీనటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్‌.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. రాజకీయాలకు అతీతంగా దీనిపై స్పందించి, తుపాను ప్రభావిత ప్రజలకు అండగా ఉండాలని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. ‘ఈ తుపాను వల్ల కావేరీ డెల్టా, తమిళనాడు తీర ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. కేరళ ప్రభుత్వంతో పాటు విూ రాష్ట్ర ప్రజలు కలిసి తమిళనాడుకు సాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ తుపాను కారణంగా రైతులు తమ పంటలను కోల్పోయారు. ఎన్నో పడవలు ధ్వంసం కావడంతో మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారు. చాలా మంది రైతులు, మత్స్యకారులు నిరాశ్రయులయ్యారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై రాజకీయాలకు అతీతంగా స్పందించి, స్వచ్ఛమైన మానవత్వంతో సాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ తుపాను వల్ల సంభవించిన నష్టం నుంచి కోలుకోవడానికి కొన్నేళ్లు పడుతుంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నాను. మనందరం కలిస్తే ఆయా ప్రాంతాల్లో పునర్నిర్మాణ పనులను మొదలుపెట్టి ఆదుకోవచ్చని కమల్‌హాసన్‌ కోరారు. కాగా, గజ తుపాను వల్ల వచ్చిన నష్టాన్ని భర్తీ చేసేందుకు తమిళనాడుకు రూ.15,000 కోట్లు విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఇటీవల దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరిన విషయం తెలిసిందే.