తెలంగాణ బిల్లు పెట్టాల్సిందే రెండో రోజు టీ-ఎంపీల ధర్నా

 

పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద బైఠాయింపు

మద్దతు పలికిన మంత్రి సర్వే

న్యూఢిల్లీ, నవంబర్‌ 23:తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని టీ-కాంగ్రెస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఇవ్వక పోతే పార్టీ నుంచి బయటకు వెళ్లాలా? లేక తెలంగాణ ఫ్రంట్‌ పెట్టాలా? అనే విషయంపై అందరితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని వారు వెల్లడించారు. తెలంగాణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ శుక్రవారం రెండో రోజు ధర్నా నిర్వహించారు. పార్లమెంట్‌కు సమావేశాలకు డుమ్మా కొట్టిన తెలంగాణ ప్రాంత ఎంపీలు ఒకటో నెంబర్‌ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ‘ప్రత్యేక’ నినాదాలు చేశారు. ఎంపీలు మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మధుయాష్కి, పొన్నం ప్రభాకర్‌, రాజయ్య, వివేక్‌ ప్లకార్డులు పట్టుకొని, తెలంగాణ నినాదాలతో ¬రెత్తించారు. వారితో పాటు కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కూడా కొద్దిసేపు ధర్నాలో పాల్గొన్నారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. అనంతరం టీ-ఎంపీలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం వెల్లడించే వరకూ సభకు హాజరు కాబోమని తేల్చిచెప్పారు. తక్షణమే తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటూ నినాదాలు చేశారు. తెలంగాణ కోసం హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఇంత ఉద్ధృతంగా జరుగుతున్నా తెలంగాణకు అన్యాయమే జరుగుతోందని ఎంపీ వివేక్‌ అన్నారు. కృష్ణా జలాల తరలింపే అందుకు నిదర్శనమని చెప్పారు. నీటి వనరులు, నిధులు, ఉద్యోగాలు, ఇలా అన్నింట్లోనూ తమ పట్ల పక్షపాతం చూపుతున్నారని విమర్శించారు. తెలంగాణ వస్తేనే తమకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు. టీ-కాంగ్రెస్‌ ఎంపీలంతా కలిసే ఉన్నామని, ఎలాంటి విభేదాలు లేవని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ కోసం హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ప్యాకేజీలు, మండళ్లతో తెలంగాణ అభివృద్ధి చెందదని, రాష్ట్ర ఏర్పాటే అన్ని సమస్యలకు పరిష్కారమని చెప్పారు.

తెలంగాణ ప్రాంతంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వివక్ష చూపుతున్నారని ఎంపీ  గుత్తా సుఖేందర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. నాగార్జున సాగర్‌కు కాకుండా ఇతర ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారని, ఇది కచ్చితంగా జల దోపిడీయేనన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. కృష్ణా జలాలను దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో 40 టీఎంసీలు తరలించుకుపోయారని, ఇప్పుడు 20 టీఎంసీల నీరు తరలిస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల తరలింపుపై మూడు, నాలుగు సార్లు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. నీటి విడుదల విషయంలో వివక్షపై ప్రధాని, సోనియాలకు లేఖ రాశామన్నారు. కృష్ణ జలాలను సక్రమంగా పంచాలని ప్రధాని, సోనియాలను కలిసి కోరనున్నట్లు ఆయన చెప్పారు. నీటి పంపిణీకి ప్రత్యేక రెగ్యులేటరీని ఏర్పాటు చేయానలి గుత్తా డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టి హంద్రీ-నీవాకు నీటి కేటాయింపులు జరపడం సరికాదన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు పేరుతో మంత్రి రఘువీరారెడ్డి పాదయాత్ర చేపడితే… దానికి తెలంగాణ ప్రాంత మంత్రులు హాజరు కావడం దురదృష్టకరమన్నారు.