తెలంగాణ సమైక్య వజ్రోత్సవాల విజయవంతం చేయాలి…
ప్రజా ప్రతినిధులకు అధికారులకు మంత్రుల దిశా నిర్దేశం…
ఫోటో రైటప్: టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న మంత్రి..
వరంగల్ బ్యూరో: సెప్టెంబర్ 14( జనం సాక్షి)
ఈ నెల 16, 17, 18 తేదీలలో నిర్వహించనున్న తెలంగాణ సమైక్య వజ్రోత్సవాల విజయవంతానికి ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కదిలింది. సిఎం కెసిఆర్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ల ఆదేశానుసారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ మూడు రోజుల కార్యక్రమాల నిర్వహణపై పూర్తి స్థాయి దృష్టిసారించారు. కాగా, ఇదే విషయమై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, సీపీ, ఎస్పీ లు ఇతర శాఖల అధికారులు, ఇంచార్జీ లు, జెడ్పీ చైర్మన్ లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులతో వేర్వేరుగా ఫోన్ లో మాట్లాడారు. తెలంగాణ సమైక్య వజ్రోత్సవాల నిర్వహణ పై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ల టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రుల ఆదేశాలతో ఎక్కడికక్కడ జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా సమీక్షలు జరిగాయి. అలాగే ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ లు మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ ఆదేశానుసారం తెలంగాణ సమైక్య వజ్రోత్సవాలు పకడ్బందీగా అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులకు చెప్పారు. అలాగే ప్రజాప్రతినిధులు మొత్తం ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల పరస్పర సమన్వయం తో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. 16వ తేదీన ర్యాలీలు నిర్వహించి, సభలు, సమావేశాలు పెట్టుకోవాలని, నాటి తెలంగాణ చరిత్ర, నేటి తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించాలని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, వివిధ కళారూపాలను ప్రదర్శించి, తెలంగాణ పూర్వ, ప్రస్తుత వైభవాన్ని చాటాలన్నారు. 17వ తేదీన జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణలు జరిపి, ముఖ్య అతిథుల ప్రసంగాలు చేయాలని, ఈ ప్రసంగాల్లో సైతం తెలంగాణ వైభవాన్ని చాటే విధంగా అంశాలు ఉండాలని చెప్పారు. అలాగే, ఇదే రోజు హైదరాబాద్ లో సిఎం కెసిఆర్ ప్రారంభించనున్న ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ప్రజలు, ప్రత్యేకించి ఆదివాసీ గిరిజనులు భారీ ఎత్తున తరలి వెళ్ళాలని చెప్పారు. 18వ తేదీన జిల్లా కేంద్రాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులు, కవులు, కళాకారులను సముచిత రీతిలో సత్కరించుకోవాలని మంత్రులు చెప్పారు.
పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులకు దిశానిర్దేశం….
పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులు కూడా ప్రజలతోపాటు కలిసి ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావలని మంత్రులు ఆదేశించారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో వేర్వేరుగా నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రులు చెప్పారు. ఈ కార్యక్రమం ఒక పండుగలా జరగాలని అందుకు ప్రజలను విరివిగా భాగస్వామ్యం చేయాలని చెప్పారు. అటు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.