దిక్కుతోచని స్థితిలో మాయావతి 


యూపిలో మళ్లీ పాగా వేసేందుకు యత్నాలు
లక్నో,జూలై24(జ‌నంసాక్షి): యూపిలో ఓటమి తరవాత మాయావతికి దిక్కుతోచకుండా పోయిందన్నది తాజా పరిణామాలను గమనిస్తే అర్థం చేసుకోవచ్చు. బిఎస్పీ అధినేత దివంతగా కాన్షీరమ్‌ దళిత ఉద్దరణ పథం నుంచి పక్కకు పోయిన మాయావతి రాజకీయలబ్ది లక్ష్యంగా తీసుకున్న నిర్ణయాలు బెడిసి కొడుతున్నాయి. యూపిలో వరుసగా ఓటమి చెందడం కారణంగా ఇక ఆమె రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసింది. దీంతో మరో ఐదేళ్ల వరకు ఆమె రాజకీయ శూన్యతతో గడపాలి. తనకున్న రాజ్యసభ పదవి కూడా లేకుండా పోయింది. ఈ దశలో యూపిలో దళితులపై దాడులను బూచిగా చూపి  పబ్బం గడుపుకునే యత్నాలకు దిగుతున్నారు. ఇదంతా ఓ పద్దతి ప్రకారం, వ్యూహం ప్రకారంగానే చేస్తున్న ప్రయత్నాలుగా గుర్తించాలి. రాజకీయంగా ఆమె ఏ మేరకు లబ్ది చేకూర్చనుందన్నది తరవాతి రోజుల్లో మాత్రమే తెలుస్తుంది.  దళితులకు సంబంధించి కేంద్రంలోని మోడీ సర్కార్‌ చిన్నచూపు చూస్తోందని మొత్తం దళిత వర్గాలకు సంకేతాలు వెళ్ళే విధంగా రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఆమె కార్యక్రమాలు చేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో అవేవిూ ఫలించలేదు. ఎస్పీతో పొత్తు కూడా బెడిసింది. దీంతో ఇక వచ్చే అసెంబ్లీ ఎన్‌ఇనకల
వరకు వేచిచూడాక తప్పదు. ఈలోగా పునాదులు వేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుత రాజకీయాల్లో మోడీని ఢీకొనాలంటే మళ్లీ దళిత వాదాన్ని ముందుకు తీసుకుని రావాలని మాయావతి  భావిస్తున్నారు. కాన్షీరామ్‌ ఆలోచనలకు అనుగుణంగా మళ్లీ పార్టీని పునరుత్తేజం చేయాలని చూస్తున్నారు. నిజానికి కాన్షీరామ్‌ విధానాలను పక్కకు పెట్టి , కేవలం అధికార యావతో రాజకీయాలు నడపడం వల్లనే ఆ పార్టీ దెబ్బతింటూ వస్తోంది. ఇది గమనించిన మాయావతి మళ్లీ  అందుకోసం క్షేత్రస్థాయి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే గత కొంతకాలంగా ఎన్నికల్లో వరుస ఎదురు దెబ్బలతో కాస్తా వెనుకబడినట్టు కనిపించిన మాయావతి దేశ రాజకీయాల్లో మళ్ళీ కీలకంగా మారే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. తన వ్యూహంలో భాగంగానే మళ్లీ దళితులు, మైనార్టీలను అక్కున చేర్చుకోవడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి యూపిలో మళ్లీ పాగా వేయాలని చూస్తోంది. బిజెపి పతనానికి నాంది అంటూ ప్రచారం చేసుకోవడం ద్వారా రాజకీయ మార్పునకు నాంది అంటూ మాయావతి ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా దళిత, మైనారిటీ, వెనుకబడిన తరగతుల ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాలు కాబట్టి మళ్లీ వారి ప్రాపకం పొందాలని చేస్తున్నారు.  కాబట్టి యూపి  నుంచే బీఎస్పీ పునర్‌ వైభవానికి మాయావతి పునాది వేయాలని భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మాయావతి ప్లాన్‌ సక్సెస్‌ అవుతుందా లేదా అన్నది యోగి ఆదిత్యనాథ్‌ , మౌర్యల ప్రతి వ్యూహాలపైనా ఆధారపడి ఉంది.