దేశ రాజకీయాల్లో సమర్థ పాలన రావాలి

అప్పుడే అభివృద్ది జరుగుతుంది: కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ విమర్శలు చేశారు. తమ పార్టీ 7వ జాతీయ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ‘దేశంలో ఇప్పటికీ పేదరికం, నిరుద్యోగం, ఆకలి బాధలు ఉన్నాయి. ఈ తప్పు ప్రజలది కాదు.. దేశ రాజకీయాలదన్నారు.  సమర్థవంతమైన పాలన ఉంటే దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు. ఎటువంటి అభివృద్ధి పనులు జరగడం లేదని ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ గెలుపుని ప్రతిబింబించడం లేదు. భాజపా ఓటమిని చూపుతున్నాయి. ప్రజల ముందు భాజపా లేదా కాంగ్రెస్‌ మాత్రమే ఉన్నాయి. ఏదో ఒకదానికి ఓటు వేయాల్సి వస్తుంది. దశాబ్దాల కాంగ్రెస్‌ పాలనపై కూడా ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు’ అని వ్యాఖ్యానించారు. ‘దేశాన్ని నాలుగేళ్లలో అభివృద్ధి చేయవచ్చన్న ఆశను, నమ్మకాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రజల్లో నింపింది. దిల్లీలో మన ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకోబోతుంది. గత 70 ఏళ్లుగా భాజపా, కాంగ్రెస్‌ చేయలేని పనులను దిల్లీలో చేసి చూపాం. పాలన బాగుంటే ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు మెరుగవుతాయని, విద్యుత్‌ ఛార్జీలు తగ్గుతాయని, రైతుల ఆత్మహత్యలు ఉండవని దిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం తమ పనులతో దేశ ప్రజల్లో నమ్మకాన్ని నెలకొల్పింది. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఏ మాత్రమూ లేదు. ఇక్కడి ప్రజలు మళ్లీ ఆమ్‌ ఆద్మీ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు దిల్లీలో అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ తీరు వల్ల ఆప్‌ చాలా సమస్యలు ఎదుర్కొంది. మాపై సీబీఐ సోదాలు కూడా జరిగాయి. మమ్మల్ని అవమాన పర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మాకు ఎన్ని సమస్యలు ఎదురైనా చివరి వరకు దేశం కోసం పని చేస్తాం’ అని కేజీవ్రాల్‌ వ్యాఖ్యానించారు.