దొంగతనం అనుమానంతో మహిళకు అవమానం

బట్టలూడదీసి కొట్టిన పోలీసులు
విచారణకు ఆదేశించిన అధికారులు
న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) : దొంగతనం నెపంతో ఓ మహిళ బట్టలూడదీసి  పోలీసులు చితక్కొట్టారు. ఈ దారుణ సంఘటన గురుగ్రామ్‌లోని ఓ పోలీసు స్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. డీఎల్‌ఎఫ్‌ ఫేజ్‌ 1 పోలీసు స్టేషన్‌ పరిధిలో అసోంకు చెందిన 30 ఏళ్ల మహిళ ఓ ఇంట్లో పనిమనిషిగా పని చేస్తోంది. అయితే ఆ ఇంట్లో దొంగతనం జరిగిందని.. పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేసిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పనిమనిషిని పోలీసు స్టేషన్‌కు పిలిపించారు పోలీసులు. ఆ తర్వాత ఆమెను ఏఎస్‌ఐ మధుబాల లాకప్‌ రూమ్‌లో బంధించింది. అనంతరం పనిమనిషి బట్టలు విప్పించి బెల్టులు, బ్యాటన్‌లతో విచక్షణారహితంగా చితకబాదింది ఆ మహిళా పోలీసు అధికారి. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని ఆమెను పోలీసులు బలవంతం చేశారు. ఆమె నేరం చేసినట్లు అంగీకరించకపోవడంతో ప్రయివేటు భాగాల్లో కూడా దారుణంగా కొట్టారు. దీంతో పనిమనిషి, ఆమె భర్త కలిసి గురుగ్రామ్‌ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసు కమిషనర్‌ విచారణకు ఆదేశించారు. పనిమనిషిని చితకబాదిన ఎస్‌హెచ్‌వో సవైట్‌ కుమార్‌, ఏఎస్‌ఐ మధుబాల, హెచ్‌సీ అనిల్‌ కుమార్‌, మహిళా కానిస్టేబుల్‌ కవితపై చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.