ధర్వాజ దాటని ఎంపీలు
ఊరూ వాడ ఒక్కటై తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమిస్తోంది. ప్రజలంతా రోడ్లపైకి చేరి నిరసనలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. అందరిదీ ఒక్కటే లక్ష్యం.. ఆత్మగౌరవ పోరాటం. సీమాంధ్ర పాలకులు ఆధిపత్యానికి వ్యతిరేకంగా స్వపరిపాలన కోసం సాగిస్తున్న ఉద్యమం. ప్రజలంతా ఉద్యమ బాటన నడిస్తే ప్రజాప్రతినిధులు మాత్రం సొంతదారులు చూసుకుంటున్నారు. ప్రజలంతా తమ ప్రతినిధులుగా ఎంపీలను పార్లమెంట్‌కు పంపితే వారు వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమాలకు తావిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను పల్లెపల్లె చాటిచెప్పుతుండగా వారు మాత్రం అందుకు కాస్త భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ఆకాంక్షను అత్యున్నతమైన పార్లమెంట్‌లో చాటిచెప్పే అవకాశాన్ని వారికి కట్టబెట్టినా అందుకు విరుద్ధంగా ప్రవరిస్తున్నారు. చట్టసభల్లో ప్రవేశించే అధికారం వారికి మాత్రమే ఉంది. ప్రజలు అన్ని పనులు వదులుకొని ఉద్యమానికి ఊతమిస్తున్నారు. చట్టసభల్లో ప్రవేశించే అధికారం ఉన్నా వారు ఎందుకులోపలికి వెళ్లడం లేదనేది అంతుపట్టడం లేదు. ఎంపీలు ఇప్పటి వరకు కాస్త పర్వాలేదనిపించినా మంత్రులు మాత్రం తెలంగాణ కావాలని అడిగిన వారిపై ఎదురుదాడికి దిగుతున్నారు. పార్లమెంట్ సాక్షిగా జరుగుతున్న తతంగంపై ప్రజల్లో ఒకింత అసహనం, మరెన్నో అనుమానాలు కలుగుతున్నాయి. గురువారం ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ఎంపీలందరూ హాజరుకావాలని కాంగ్రెస్ అధిష్టానం విప్ జారీ చేసినా ధిక్కరిస్తున్నామంటూ బీరాలు పోయి పార్లమెంట్ ప్రధాన ద్వారం ఎదుట ప్లకార్డులతో బైఠాయించి నిరసన తెలిపారు. పార్టీ అధిష్టానాన్నే ధిక్కరిస్తున్నామనే కలర్ ఇస్తూ ప్రజల మనుసులో స్థానం పదిలం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారే తప్ప వారిలో చిత్తశుద్ధి కరువైంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడిన రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌తో విభేదించి ప్రజల్లో సానుభూతి పొందిన ఎంపీలు రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే లక్ష్యంతో తమ సొంత ఎజెండా పాటిస్తున్నారు. రైలు రోకో సమయంలో జైలుకు వెళ్లిన ఎంపీలతో మంత్రి పదవులు పట్టుకుని, పదవుల కోసం పాకులాడుతున్న వారిని జతకట్టలేం. కానీ వారి ప్రస్తుత తీరుపైనే సందేహాలు వస్తున్నాయి. ఒకనొక దశలో పార్లమెంట్‌లో అధినేత్రి సోనియా ఎదుట నిరసన తెలిపిన ఎంపీలు ఉన్నట్టుండి పార్లమెంట్‌లోపలికి వెళ్లేందుకే ఎందుకు వెనుకాడుతున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రజాస్వామ్య బద్ధంగా పార్లమెంట్‌లో నిరసన తెలిపే హక్కున్నా ఎందుకు గుమ్మం బయటే వేలాడుతున్నారనేది అర్థం కావడం లేదు. అధిష్టానం పెద్దల సూచనల మేరకే తెలంగాణలో పార్టీకి నష్టం కలుగకుండా వారు వ్యవహరిస్తున్నారా? సోనియాగాంధీకి బయపడుతున్నారా? లేక తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు చెబుతున్నట్లు పార్టీ వీడేందుకు సిద్ధపడే తమ ప్రయత్నాలు సాగిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిల్లర వర్తకంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ విపక్షాలన్నీ నిరసన గళం వినిపిస్తుండగా తమ ఆందోళనను ఎవరు పట్టించుకుంటారనే భావనతోనే ఇలా చేస్తున్నారా అనే అనుమానం వ్యక్తమవుతుంది. పార్లమెంట్ బయట విలేకరులతో మాట్లాడిన ఎంపీలు మందా జగన్నాథం, మధుయాష్కీ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, వివేక్, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసవరమైతే పార్టీ వీడేందుకు సిద్ధమని ప్రకటించారు. బయటకు వెళ్లాక కొత్తగా పార్టీ ఏర్పాటు చేయాలా, ఫ్రంట్ ఏర్పాటు చేయాలా అన్నది అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రెండో రోజు శుక్రవారం కూడా టీ ఎంపీలు గుమ్మం బయట నిరసనలకే పరిమితమయ్యారు. ఇటీవల స్వామిభక్తితో మంత్రి పదవి చేజిక్కించుకున్న సర్వే సత్యనారాయణ వీరికి జతకలిశారు. అధికార పార్టీ ఎంపీలు ధర్వాజ బయటే నిరసనలతో హోరెత్తించడమే అనేక అనుమాలకు తావిస్తుంటే సాక్షాత్తూ కేంద్ర మంత్రే వారికి మద్దతు పలకడం అనుమాలకు బలం చేకూరుస్తోంది. అధిష్టానం ఆడిస్తున్న నాటకంలో ఎంపీలు పావులుగా మారి మరోసారి తెలంగాణ వాదాన్ని బలిపెట్టాలని చూస్తున్నారా? లేక 2014 ఎన్నికల వరకు అంశాన్ని సాగదీయాలని ప్రయత్నిస్తున్నారా అనేది తేలడం లేదు. మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో చర్చల పేరుతో సంప్రదింపులు జరిపిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు అదే పార్టీ మోసం చేసిందని చెబుతూ ఉద్యమ బాట పట్టారు. కరీంనగర్‌లో నిర్వహించిన మేధోమథనంలో ఇక ఉగ్రనర్సింహ అవతారం చూస్తారని ప్రకటించి ప్రజలను ఆకట్టుకునే ప్రతయ్నం చేశారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తామన్న మోసం చేశారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగి తెలంగాణ సాధనకు ఎంపీ, ఎమ్యెల్యే సీట్లే ముఖ్యమని ఒకింత గందరగోళానికి గురిచేసినా ప్రత్యర్థి పార్టీల నేతలను మాత్రం బాగానే ఆకర్షిస్తున్నారు. సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కేశవరావు ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. మరికొందరు ఎంపీలకు ఇవే సంకేతాలు పంపారు. కొందరు తెరచాటున సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీల నిరసనలపై అనుమానపు భీజాలు మొలకెత్తుతున్నాయి. అయితే టీఆర్‌ఎస్‌లోకి వెళ్తే కలిగే ప్రయోజనాలు, సొంత ఎజెండాతో ముందుకు సాగితే ఎదురయ్యే సవాళ్లను బేరీజు వేసుకున్నాకే వారు నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం.