నాలుగు నెలల్లో 76 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేయాలి

ఏడాది చివరి కి సింగరేణి సోలార్ సామర్థ్యం 300 మెగావాట్లు చేరుకోవాలి
రెండో దశ సోలార్ లో 240 మెగావాట్ల సోలార్ ను వచ్చే ఏడాది లోపు పూర్తి చేయాలి
సింగరేణి థర్మల్, సోలార్ సమీక్షలో సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాలు.-
సింగరేణి కాలరీస్ కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 300 మెగావాట్లకు చేరుకోవాలని, మొదటి దశలో మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాన్ని వీలైనంత త్వరితగతిన పూర్తి చేయాలని సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన సింగరేణి థర్మల్, సోలార్ విద్యుత్ సమీక్ష సమావేశంలో సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ వీటిపై సమగ్రంగా చర్చించారు.
మొదటి దశలో 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించగా.. వీటిలో 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ సహా మొత్తం 224 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం పూర్తయి ఉత్పత్తి జరుగుతోందని.. మిగిలిన 76 మెగావాట్లను ఈ ఏడాది నవంబరులోగా పూర్తి చేయాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో చేపట్టనున్న 11 మెగావాట్ల, కొత్తగూడెంలో చేపట్టనున్న 10.5 మెగావాట్ల ప్లాంట్లను ఈ సెప్టెంబరులోగా పూర్తి చేయాలన్నారు. అలాగే రామగుండం ఓసీ-1 ఓవర్ బర్డెన్ డంప్పై చేపట్టే 22 మెగావాట్లను అక్టోబరులోగా, కొత్తగూడెంలో చేపట్టే 22.5 మెగావాట్ల ను నవంబరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎస్టీపీపీ జలాశయంలో చేపట్టనున్న 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ లో ఇప్పటికే 5 మెగావాట్లు పూర్తి కాగా.. మిగిలిన 10 మెగావాట్లను ఈ డిసెంబరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అలాగే 2024-25 నాటికి సింగరేణి సంస్థ తన సంస్థాగత ఇంధన అవసరాలను సోలార్ విద్యుత్ ద్వారా తీర్చుకోవడం ద్వారా నెట్ జీరో కంపెనీగా మారేందుకు వీలుగా రెండో దశలో 240 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించగా.. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి వచ్చే ఏడాదిలోగా ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
వీటిలో సత్తుపల్లి వద్ద 35 మెగావాట్ల ప్లాంట్లు, శ్రీరాంపూర్ ఐ.కె. చెన్నూరు వద్ద 27.5 మెగావాట్ల ప్లాంటు, మందమర్రి ప్రాంతంలో పలు గనులు, కాలనీల వద్ద అందుబాటులో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో 65 మెగావాట్ల సామర్థ్యంతో 5 ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలంలో 37.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను, రామగుండం-3 ఏరియాలో 41 మెగావాట్ల సామర్థ్యం కోసం రెండు చోట్ల ప్లాంట్లు నిర్మించాలని, భూపాలపల్లిలో 12 మెగావాట్ల ప్లాంట్ ను, రామగుండం-1 ఏరియాలో పాత పవర్ హౌస్ స్థలంలో 5 మెగావాట్ల ప్లాంట్ ను, ఇల్లందులో ప్రస్తుతం ఉన్న సోలార్ ప్లాంట్ కు పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో 15 మెగావాట్ల ప్లాంట్ లను నిర్మించనున్నారు.
ఎస్టీపీపీని ఈ ఏడాదీ నెంబర్-1లో నిలపాలి
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అత్యద్భుత పనితీరుతో దేశంలో నెంబర్-1 స్థానంలో నిలిపేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఛైర్మన్, ఎండీ
ఎన్.శ్రీధర్ ఆదేశించారు. ఎస్టీపీపీలోని మొదటి యూనిట్కు సంబంధించి క్యాపిటల్ ఓవర్ హాలింగ్(అన్ని యంత్రాల సమగ్ర పరిశీలన) ను చేపట్టామని.. సాధారణంగా క్యాపిట్ ఓవర్ హాలింగ్కు 45 రోజుల సమయం పడుతుందని.. కానీ 35 రోజుల్లేనే ఈ ప్రక్రియను పూర్తి చేసి యూనిట్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా అధికారులు వివరించారు. దీనిపై ఛైర్మన్ మరియు ఎండీ హర్షం వ్యక్తం చేస్తూ.. రానున్న రోజుల్లో ఎలాంటి బ్రేక్ డౌన్ లేకుండా అత్యుత్తమ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ను నమోదు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి సీటీసీ సంజయ్ కుమార్ సుర్, జీఎం(ఎస్టీపీపీ) డి.వి.ఎస్.ఎస్.ఎన్.రాజు, జీఎం(సోలార్) జానకిరాం, చీఫ్ ఆఫ్ పవర్
ఎన్.వి.కె.విశ్వనాథ రాజు, ఏజీఎం(సివిల్) కె.ఎస్.ఎన్.ప్రసాద్, ఏజీఎం(ఫైనాన్స్) సుధాకర్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ ఓ అండ్ ఎం జె.ఎన్.సింగ్, జీఎం(సివిల్) టి.సూర్యనారాయణ తదితర పాల్గొన్నారు.



