నిర్దోషిగా తేలే వరకు వస్తూనే ఉంటా

– ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన రాబర్ట్‌ వాద్రా
న్యూఢిల్లీ, మే30(జ‌నంసాక్షి) : నిర్దోషిగా తేలేవరకు ఈడీసీ విచారణకు హాజరవుతానని, నిర్దోషిగా నిరూపించుకుంటానని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా అన్నారు. గురువారం రాబర్ట్‌ వాద్రా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే గతంలో ఆయన్ను ఈడీ దాదాపు 70 గంటల పాటు ప్రశ్నించింది. గురువారం లండన్‌, దుబాయ్‌, రాజస్థాన్‌, ఎన్‌సీఆర్‌ పరిధిలో ఆస్తుల కొనుగోలుకు సంబంధించి ఈడీ ఆయన్ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ అక్రమ ఆస్తుల కేసులో విచారణకు హాజరుకావడం ఇది తొమ్మిదోసారి. ఈ సందర్భంగా రాబర్ట్‌ వాద్రా తన ఫేస్‌ బుక్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు నేను 11సార్లు 70గంటలపాటు విచారణకు హాజరయ్యానని అన్నారు. భవిష్యత్తులో కూడా వస్తానని, ఈ అక్రమ కేసుల నుంచి నా పేరు తొలగించే వరకు నేను విచారణకు సహకరిస్తానని వాద్రా తన ఫేస్‌ బుక్‌లో పోస్టు చేశారు. ఈ పోస్టులో ఆయన ఫొటోతోపాటు జవహర్‌ లాల్‌ నెహ్రూ ఫొటో కూడా పోస్టు చేశారు. రాబర్టువాద్రాకు ప్రత్యక్షంగా.. పరోక్షంగా లండన్‌లో తొమ్మిది ఆస్తులు ఉన్నాయి. వీటివిలువ 12 మిలియన్‌ పౌండ్లు. వీటిల్లో మూడు విల్లాలు కాగా, మిగిలిన విలాసవంతమైన ప్లాంట్లు. వీటన్నింటినీ ఆయన 2005 నుంచి 2010 మధ్యలో కొనుగోలు చేశారు. అప్పట్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ కేసులకు సంబంధించి వాద్రాను విచారించేందుకు కస్టడీకి అనుమతించాలని బుధవారం ఈడీ ఢిల్లీ హైకోర్టును కోరింది. దీంతో కోర్టు ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు గురువరాం ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు.