నిర్భయ రేపిస్టు వ్యాఖ్యలను ఖండించిన ఐరాస
న్యూయార్క్: నిర్భయ కేసులో దోషి ముఖేశ్ సింగ్ వ్యాఖ్యలను ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. అతని మాటలు అత్యంత జుగుస్సాకరంగా ఉన్నాయని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజార్రిక్ ఆగ్రహించారు. మనుషులు మాట్లాడలేనంత నీచంగా అతని వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మహిళలపై అతని ఆలోచనలు అత్యంత అసహ్యకరంగా ఉండడం గర్హనీయం అన్నారు.
మహిళలపై అఘాయిత్యాలను అడ్డుకోవడంలో పురుషులు తగు పాత్ర పోషించాలన్నారు. నిర్భయ ఉదంతంపై తీసిన డాక్యుమెంటరీ ప్రసారాన్ని భారత ప్రభుత్వం నిషేధించడంపై స్పందించడానికి నిరాకరించారు. నిర్భయ గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించిన బీబీసీ ఆమె తల్లిదండ్రులు, డిఫెన్స్ లాయర్లు, పోలీసులు, వైద్యులను సంప్రదించి ఇండియాస్ డాటర్ అనే డాక్యుమెంటరీని రూపొందించింది. అందులో రేపిస్టు ముఖేశ్ సింగ్, అతని డిఫెన్స్ న్యాయవాదుల వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఆ డాక్యుమెంటరీపై నిషేధం విధించింది.