నేటి తరానికి స్ఫూర్తి వాజ్‌పేయి

– వాజ్‌పేయీకి ప్రధాని మోదీ ఘన నివాళి
న్యూఢిల్లీ, డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : నేటి తరానికి స్ఫూర్తి దాయకమైన వ్యక్తి మాజీ ప్రధాని అటల్‌ బీహారి వాజ్‌పేయి అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ 94వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని రాష్టీయ్ర స్మృతి స్థల్‌ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ప్రధాని మోదీ అంజలి ఘటించారు. ఆయనతో పాటు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ దేశానికి, పార్టీ బలోపేతానికి అటల్‌ బీహార్‌ వాజ్‌పేయి చేసిన సేవలను కొనియాడారు. నీతి, నిబద్దత కలిగిన రాజకీయాలను చేసిన వ్యక్తి వాజ్‌పేయి అని అన్నారు. ఆయన అడుగు జాడల్లోనే నాలుగేళ్లుగా భాజపా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ దేశాభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని అన్నారు.
తెలంగాణ భాజపా కార్యాలయంలో..
మాజీ ప్రధాని వాజ్‌పేయీ 94వ జయంతి సందర్భంగా తెలంగాణ భాజపా కార్యాలయంలో ఆ పార్టీ నేతలు నివాళులు అర్పించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు, ఎంపీ బండారు దత్తాత్రేయ, సీనియర్‌ నాయకులు కిషన్‌ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. వాజ్‌పేయీ జయంతిని సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలు ఈనాటి తరానికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నాయని తెలిపారు. అధికారం కోసం తాపత్రయ పడకుండా యావత్‌ భారతదేశానికి సేవచేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్‌ అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం జరపలేని దుస్థితిలో రాష్ట్రం ఉందని, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఇతర  రాష్ట్రాలు తిరుగుతూ పాలనను గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. బడుగు, బలహీన, పేదల సంక్షేమం కోసం పాటుపడింది మోదీ ప్రభుత్వమేనని ఎంపీ దత్తాత్రేయ అన్నారు. అంకిత భావంతో వాజ్‌పేయీ పని చేసి దేశంలో అవినీతి అంతం చేశారని కొనియాడారు.