నేటి నుంచే కుంభమేళా

– మార్చి 4వరకు కొనసాగనున్న వేడుకలు
12కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా
– భారీ ఏర్పాట్లు చేసిన ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం
– 100హెక్టార్ల విస్తీర్ణంలో ‘టెంట్‌ సిటీ’
– ప్రత్యేక రోజుల్లో రాజయోగ స్నానాలు
– భారీగా తరలిరానున్న నాగ సాధువులు
– ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక విమానాలు
న్యూఢిల్లీ, జనవరి14(జ‌నంసాక్షి) : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అర్ధకుంభమేళా నేటి(మంగళవారం) నుంచి ప్రారంభం కానుంది. సంక్రాంతి నుంచి మహా శివరాత్రి(మార్చి4) వరకూ ఈ వేడుక కొనసాగుతుంది. ఈ సమయంలో గంగ, యమున, సరస్వతీ (అంతర్వాహిని) నదుల త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు చేసిన భక్తుల పాపాలు నశించి, మోక్షం ప్రాప్తిస్తుందని పురాణ కథనం. ఆరేళ్లకోసారి ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించే కుంభ్‌మేళాకు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కూడా లభించింది. కాగా, జనవరి 15న (ఉదయం 5.15 నుంచి సాయంత్రం 4.20 గంటల వరకూ) మొదటి రాజయోగ స్నానానికి (షాహీ స్నానం) యూపీ ప్రభుత్వం ప్రత్యేక ఘాట్‌లు సిద్ధం చేసింది. ఈ స్నానాలు చేయడానికి బంగారు, వెండి పల్లకీలపై, గుర్రాలు, ఒంటెలు, ఏనుగులపై అనుచరగణంతో ఊరేగింపుగా తరలివచ్చే నాగ సాధువులు, సన్యాసులు, యోగులతో ప్రయాగ్‌రాజ్‌ సందడిగా మారనుంది. రంగురంగుల ముగ్గులు, పూల తోరణాలతో వీరు వచ్చే మార్గాలను సుందరంగా ముస్తాబు చేస్తారు. ‘హర హర మహాదేవ్‌’ నినాదాలతో పురవీధులు మార్మోగుతాయి. వీరంతా నదిలో స్నానాలు చేసిన తర్వాతే సాధారణ ప్రజలు మునుగుతారు. ఈ సమయంలో సాధువుల ఆశీర్వాదాల కోసం భక్తులు పోటీలు పడతారు. ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూసేందుకు దేశ, విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు తరలివస్తారు.
కుంభమేళాకు 7వేల కోట్ల నిధులు..
కుంభమేళా నిర్వహణ కోసం యోగి సర్కారు రూ.7వేల కోట్లు నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో 3200 హెక్టార్ల విస్తీర్ణంలో 1.22లక్షల తాత్కాలిక టాయిలెట్లు, 20వేల డస్ట్‌ బిన్లు, 42డ్రైనేజీ కాలువలను అధికారులు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ప్రత్యేకంగా ఫుడ్‌ హబ్‌ ఏర్పాటు చేశారు. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆహార పదార్థాలను వేడివేడిగా వండి వడ్డిస్తారు. ప్రయాగ్‌రాజ్‌ను అందంగా ముస్తాబు చేయడానికి ఉద్దేశించిన సర్కారీ పథకమే ‘పెయింట్‌ మై సిటీ’ ఈ పథకంతో రోడ్లు, కూడళ్లు, ప్లైఓవర్లు, బిల్డింగ్‌లు, గోడలు రంగులద్దుకుని మెరిసి పోతున్నాయి. దీనికోసం ఐదు ఏజెన్సీల ఆధ్వర్యంలో దాదాపు వెయ్యికి పైగా ఆర్టిస్టులు పగలూ రాత్రి కష్టపడ్డారు. కుంభమేళా ప్రాశస్త్యాన్ని వివరించేలా ప్రభుత్వం ఓ లేజర్‌ షోను ఏర్పాటు చేసింది. సాధువుల కోసం ప్రయాగ్‌రాజ్‌లో 5వేల క్యాంపులు ఏర్పాటయ్యాయి. ఫిబ్రవరిలో దాదాపు 192 దేశాల ప్రతినిధులు కుంభమేళాకు హాజరవుతారని అధికారుల అంచనా ఇదిలా ఉంటే కుంభమేళా సందర్భంగా వివిధ ఎయిర్‌ లైన్స్‌ కంపెనీలు పలు కొత్త మార్గాల్లో తమ సర్వీసులను ప్రారంభించాయి. ఎయిర్‌ ఇండియా ప్రయాగ్‌ రాజ్‌ ఢిల్లీ, అహ్మదాబాద్‌ కోల్‌కతామార్గాల్లో సర్వీసులను నడుపుతోంది. ప్రయాగ్‌ రాజ్‌ ఢిల్లీ రూట్‌లో ప్రత్యేక విమానాలు నడుపనున్నట్లు స్పైస్‌ జెట్‌ ప్రకటించింది. కుంభమేళా సందర్భంగా వారణాసి, ప్రయాగ్‌ రాజ్‌ మధ్య
రాకపోకలను సులభతరం చేసేలా ఎయిర్‌ బోట్‌ సర్వీస్‌ ప్రవేశపెడుతున్నట్లు యోగిప్రభుత్వం ప్రకటించింది.
100హెక్టార్ల విస్తీర్ణంలో ‘టెంట్‌ సిటీ’..
కుంభమేళా అంటే హిందువులందరికీ పండగే. మూడు నదుల సంగమంలో మూడు మునకలేసేందుకూ పితృతర్పణాలు వదిలేందుకూ పూజలు చేసేందుకూ దేశం నలుమూలల నుంచీ ఎంతోమంది భక్తులు వస్తుంటారు. ఆసమయంలో త్రివేణీ సంగమం అఖండ భారతావనిలోని సంస్కృతీ సంప్రదాయాల మేళవింపుగా దర్శనమిస్తుంది. ఆ భిన్నత్వాన్ని తిలకించేందుకూ వేల సంవత్సరాల చరిత్ర ఉన్న కుంభమేళాను కళ్లారా చూసి, సనాతన ధర్మాన్ని అవగాహన చేసుకునేందుకూ విదేశీ పర్యటకులు కూడా లక్షల్లో వస్తుంటారు. అలా అటు భక్తులూ ఇటు పర్యటకులతో నదీ సంగమం చుట్టుపక్కల జనసంద్రమవుతుంది. వారందరికీ మామూలు ¬టళ్లలో గదులు దొరకడం అంటే అసాధ్యమే. దీనికి పరిష్కారంగానే ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో 100 హెక్టార్ల విస్తీర్ణంలో ‘టెంట్‌ సిటీ’ని నిర్మించింది. పేరుకు ఇవి గుడారాలేకానీ ఫైవ్‌స్టార్‌ ¬టళ్లలో ఉండే అన్ని సౌకర్యాలూ ఉండడం వీటి ప్రత్యేకత. ఇందులో హాలూ, బెడ్‌రూమ్‌, లివింగ్‌రూమ్‌లు ఉండే విల్లా టైపు గుడారాలు ఒకరకమైతే వాటికన్నా కాస్త చిన్నగా ఉండి, డబుల్‌కాట్‌ బెడ్‌తో పాటు సోఫాలూ కుర్చీలూ డ్రెస్సింగ్‌ టేబుల్‌ లాంటి సదుపాయాలన్నీ ఒకే గదిలో ఉన్నవి మరోరకం. కాస్త తక్కువ ధరలో కావాలనుకున్నవారికీ ఈ సౌకర్యాలన్నీ ఉంటాయి కానీ అయిదూ పదిమందికి కలిపి ఒకే గుడారాన్ని కేటాయిస్తారు. ఇక, ధరతో సంబంధం లేకుండా గుడారాలన్నిటిలో అటాచ్డ్‌ బాత్‌రూమ్‌, వైఫై, టీవీలు ఉంటాయి. ఆర్డర్‌ విూద భోజనం, అల్పాహారాలను అందించేందుకు పనివాళ్లూ అందుబాటులో ఉంటారు. ఎన్ని సౌకర్యాలో! నాలుగువేలకు పైగా విలాసవంతమైన గుడారాలున్న ఈ టెంట్‌ సిటీలో రెస్టారెంట్లూ యోగా సెంటర్లూ స్పాలు కూడా ఉంటాయట. అంతేకాదు, సాయంత్రం పూట ఏర్పాటుచేసే రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించొచ్చు. ఇలా.. సౌకర్యాలూ భోజన వసతుల్ని బట్టి గుడారాల అద్దెరోజుకి రూ.2,500 నుంచి రూ.30వేలకు పైగా ఉంటుందట. వీటిని ఆన్‌లైన్‌లోనూ బుక్‌ చేసుకోవచ్చు.
ప్రత్యేక రోజులు..
జనవరి 15  మకర సంక్రాంతి, జనవరి 21  పుష్య పౌర్ణమి, జనవరి 31  పుష్య ఏకాదశి, ఫిబ్రవరి 4  మౌని అమావాస్య, ఫిబ్రవరి 10  వసంత పంచమి, ఫిబ్రవరి 16  మాఘ ఏకాదశి, ఫిబ్రవరి 19  మాఘ పౌర్ణమి,
మార్చి 4  మహా శివరాత్రి.