నేడు కశ్మీర్‌ వెళ్లనున్న సీతారం ఏచూరీ

పార్టీ కార్యదర్శిని కలుసుకునేందుకు సుప్రీం అనుమతి
న్యూఢిల్లీ,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  కశ్మీర్‌కు వెళ్లేందుకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. కశ్మీర్‌లో ఉన్న ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్‌ తరిగామిని కలుసుకునేందుకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కశ్మీర్‌ వెళ్లేందుకు విూకు అనుమతి ఇస్తున్నాం, విూరు పార్టీ ప్రధాన కార్యదర్శి, కానీ మరే ఇతర పనుల గురించి అక్కడికి వెళ్లకూడదంటూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గగోయ్‌ అన్నారు. ఓ స్నేహితుడిగా వెళ్లి విూరు యూసుఫ్‌ కుటుంబాన్ని కలుసు కోవచ్చు అని ఆయన అన్నారు. కానీ ఇందులో రాజకీయ కోణం ఉండకూడదన్నారు. కశ్మీర్‌లో నేతల్ని ఎందుకు బంధించారని సీతారాం ఏచూరి సుప్రీంలో పిటిషన్‌ వేశారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇదే అంశంలో పిటిషన్‌ వేసిన మొహమ్మద్‌ అలీమ్‌ సయిద్‌ తన పేరెంట్స్‌ను కలుసుకునేందుకు అనంత్‌నాగ్‌ వెళ్లవచ్చు అంటూ కోర్టు తీర్పునిచ్చింది. సయిద్‌కు రక్షణ కల్పించాలని కశ్మీర్‌ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆర్టికల్‌ 370 రద్దుపై అయిదుగురు సభ్యుల ధర్మాసనం అక్టోబర్‌లో విచారణ చేపట్టనున్నట్లు తెలిసింది. ప్రతి పౌరుడికి కశ్మీర్‌ వెళ్లేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కల్పించాలని సీజేఐ తన తీర్పులో చెప్పారు.