నేడు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల సమావేశం
హైదరాబాద్: అధిష్ఠానంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఈరోజు సమావేశం అవుతున్నారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగే ఈ భేటీలో తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొననున్నారు. నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి షిండే వెల్లడించిన నేపథ్యంలో.. ఆ నిర్ణయం తెలంగాణకు సానుకూలంగా ఉండేందుకు పార్టీ పెద్దలపై ఒత్తిడి పెంచే వ్యూహంపై నేతలు సమావేశంలో చర్చించనున్నారు. అయితే ఈ భేటీకి పలువురు నేతలు దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. తాము సమావేశానికి హాజరయ్యేది లేదని మహబూబ్‌నగర్ జిల్లా నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు.