న్యాయ వ్యవస్థను..  చంద్రబాబు కించపరిచారు


– 12నెలలు ఇచ్చినా భవనం కట్టలేకపోయారు
– జడ్జీలు, లాయర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
– తన కేసులు విచారణకు రావొద్దు.. జగన్‌ మాత్రం జైళుకెళ్లాలా?
– బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు
న్యూఢిల్లీ, డిసెంబర్‌29(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ ప్రభుత్వ తీరుతో ఏపీ న్యాయవాదులు, జడ్జీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. శనివారం ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఇంతటి చేతకాని ముఖ్యమంత్రిని ఇప్పటివరకూ చూడలేదని ప్రజలు తిట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థను కించపరిచేలా ఏపీ ప్రభుత్వం చేసిన పనికి సీఎం చంద్రబాబుపై కోర్టు ధిక్కార నేరం కింద పిటిషన్‌ చేయవచ్చని వెల్లడించారు. కేవలం రెండంతస్తుల భవనాన్ని ఏపీ ప్రభుత్వం ఏడాది కాలంగా కట్టలేకపోయిందని గుర్తుచేశారు. ఆంధ్రాకు రాబోతున్న న్యాయమూర్తులు, లాయర్లకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని జీవీఎల్‌ డిమాండ్‌ చేశారు. ఏడు నెలల్లో హైకోర్టు భవనాన్ని కడతామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిందని తెలిపారు. అయితే నిర్ణీత సమయంలోగా భవనాన్ని నిర్మించలేక కేంద్రంపై విమర్శలు చేయడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. జనవరి1 నుంచి సీఎం క్యాంప్‌ ఆఫీసులో హైకోర్టు పెట్టుకుందామనీ, అతిథులకు బెడ్రూమ్‌ లో ఉండొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 12 నెలల గడువు పూర్తయినా
హైకోర్టు భవనాన్ని కట్టలేకపోవడం చేతకానితనం కాదా? అని జీవీఎల్‌ ప్రశ్నించారు. ‘హైకోర్టును నేనే తీసుకొచ్చా .. నేను టీడీపీ జాతీయ అధ్యక్షుడిని.. చంద్రబాబు టీడీపీ అంతర్జాతీయ అధ్యక్షుడు’ అంటూ తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ డబ్బా కొట్టుకున్నారని విమర్శించారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ ప్రతీ శుక్రవారం జైలు వెళుతుంటే, సీఎం చంద్రబాబుపై ఉన్న కేసులు కనీసం విచారణకు కూడా రావడంలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై ఉన్న కేసుల్లో విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. నిజంగా చంద్రబాబుపై ఉన్న కేసుల్లో విచారణ జరిగితే ఆయన ఇంకా సీఎం కుర్చీలోనే ఉండేవారా? అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసనీ, వారిని అమాయకులు అనుకోవద్దని హితవు పలికారు. తమపై నమోదయిన కేసులు విచారణకు రాకున్నా ఫరవాలేదు కానీ జగన్‌ కు మాత్రం వారం రోజుల్లో శిక్ష విధించాలని చంద్రబాబు కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇది ఏపీ సీఎం దగుల్బాజీ, దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని జీవీఎల్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.