పవర్‌ ప్రాజెక్టులపై..  జగన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు


– ఆయన తీరుతో పెట్టుబడులపై ప్రభావం పడుతుంది
– మేము చెప్పినా సీఎం జగన్‌ వినడం లేదు
– కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  పవర్‌ ప్రాజెక్టులపై సీఎం జగన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన వంద రోజుల ప్రగతిపై ఆయన ఓ నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరైన ఆధారాలుంటే విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు వస్తాయని, తాము చెప్పినా జగన్‌ వినడం లేదని అసహనం వ్యక్తం చేశారు. బాబు హయాంలో పీపీఏలలో అవకతవకలు జరిగినట్లు తమ దగ్గరికి లేఖలతో వచ్చి రద్దు చేయమని కోరుతున్నారని, దీనివల్ల పెట్టుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అవకతవకలు జరిగినట్లు ఎక్కడా ఆధారాలు లేవని, సరైన ఆధారాలు లేకుండా పీపీఏను రద్దు చేయాలని
సీఎం కోరుతున్నారని కేంద్రమంత్రి ఆరోపించారు. సీఎం జగన్‌ వైఖరి పెట్టుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని, పవర్‌ ప్రాజెక్టులపై జగన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తము అభివృద్ధి పనులే మళ్లీ తమకు అధికారాన్ని కట్టబెట్టాయని, ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమి దిశగా అడుగులు వేస్తున్నామని ఆర్కే సింగ్‌ ప్రకటించారు.
ఇదిలా ఉంటే జగన్‌ సర్కార్‌ పీపీఏల విషయంలో భారీగా అవకతవకలు జరిగాయని మొదటి నుంచి ఆరోపిస్తోంది. పీపీఏలను రద్దు చేసింది.. ఈ నిర్ణయంపై కొన్ని సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ఇటు కేంద్రం కూడా వైసీపీ సర్కార్‌ నిర్ణయాన్ని తప్పుబట్టింది. తాజాగా కేంద్రమంత్రి కూడా స్పందించారు. మరి పీపీఏల విషయంలో ఇన్ని ప్రతికూలతల మధ్య జగన్‌ సర్కార్‌ ఎలా ముందుకు అడుగులు వేస్తుందన్నది ఆసక్తిగా మారింది.