పాకిస్థాన్‌లో 5.5 తీవ్రతతో భూకంపం
హైదరాబాద్: పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైంది. మలకండ్, స్వాత్, దిర్ జిల్లాల్లో భూకంపం ప్రభావం కనిపించింది. తజికిస్థాన్ సమీపంలోని హిందూకుష్ పర్వతాల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తజకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఈ పర్వతాల్లో 144 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. ఆస్తి, ప్రాణ నష్టంపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని అధికారులు తెలిపారు.2013లో పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు 2005లో పాకిస్థాన్ అతి దారుణమైన భూకంపాన్ని ఎదుర్కొంది. 7.6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపంలో దాదాపు 73వేల మంది మృత్యువాతపడ్డారు.