పార్లమెంట్‌ ఆవరణలో శ్రీలక్ష్మి

త్వరగా బదిలీ యత్నాల్లో ఉన్నారని ప్రచారం?
న్యూఢిల్లీ,జూలై23(జ‌నంసాక్షి): సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి మంగళవారం ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో కనిపించారు. ఆమె వైసీపీ, బీజేపీ ఎంపీలను కలిసేందుకు పార్లమెంటుకు వచ్చారని సమాచారం.
తనను త్వరగా ఎపికి ట్రాన్స్‌ఫర్చేయించుకునేందుకు ఆమె వచ్చారని తెలుస్తోంది.  శ్రీలక్ష్మి ప్రస్తుతం తెలంగాణ కేడర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ కేడర్‌లో ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ శ్రీలక్ష్మి ఆంధప్రదేశ్‌కు రావడం దాదాపు ఖరారైంది. ఆమె ఇప్పటికే సీఎం జగన్‌తో మాట్లాడి ఏపీలో సేవలు అందించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అందుకు ఆయన అంగీకరించారని… కీలకమైన శాఖను అప్పగిస్తానని హావిూ కూడా ఇచ్చారని తెలిసింది. శ్రీలక్ష్మి ఓబుళాపురం గనుల కుంభకోణం కేసులో జైలు పాలయ్యారు. జైల్లో అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత నిర్దోషిగా బయటికి వచ్చాక ఐఏఎస్‌గా కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శ్రీలక్ష్మి అతి చిన్న వయస్సులో సివిల్‌ సర్వెంట్‌ అయ్యారు. ఆమె కెరీర్‌ ఒడిదుడుకుల్లేకుండా సాగితే కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి స్థాయికి వెళ్లేవారు. ఓబుళాపురం గనుల అవినీతి కేసులు మెడకు చుట్టుకోవడంతో వృత్తిపరంగా అడుగు ముందుకు పడని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆమె ఏపీకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని ఏపీ అధికార వర్గాలు తెలిపాయి.