ప్రజల సంక్షేమం, కలల సాకారం కోసం బీజీపీ

సామాన్యుడికి, యువరాజుకు పోటీ

నాగౌర్‌ సభలో ప్రధాని మోడీ

జైపూర్‌,నవంబర్‌28(జనంసాక్షి): ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసుకునే ఓ సామాన్య వ్యక్తి ‘యువరాజు’తో పోటీ పడుతున్నాడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్‌లోని నాగౌర్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన మోదీ.. కుటుంబ రాజకీయాలపై విమర్శలు చేశారు. రాహుల్‌ గాంధీ వంశం పేరు చెప్పుకుని వచ్చిన రాజకీయ నాయకుడని ధ్వజమెత్తారు. తాను సాధారణ వ్యక్తినని, సంపన్నుడిగా

పుట్టలేదని.. కానీ రాహుల్‌ మాత్రం యువరాజు అని పేర్కొన్నారు. ‘మేము మా మనవళ్లు, మనవరాళ్ల కోసం ఓట్లు అడగడం లేదు. విూ సంక్షేమం కోసం, విూ కలల్ని సాకారం చేయడానికి ఓట్లు అడుగుతున్నాం’ అని మోదీ వెల్లడించారు. ప్రచార సభలో మాట్లాడుతూ మోదీ పలుమార్లు కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. వారి కుటుంబంలోని నాలుగు తరాల వారు ప్రజలతో అనుసంధానం కాలేకపోయారని, వారు ప్రజల బాధలు అర్థం చేసుకోలేరని ఆరోపించారు. పూలే, అంబేడ్కర్‌ స్ఫూర్తితో ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌’ మాత్రమే తమ నినాదమని తెలిపారు. రాష్ట్రంలో మరో పర్యాయం వసుంధర రాజె ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని మోదీ ప్రజలను కోరారు. ఎడారి రాష్ట్రమైన ఇక్కడ నీటికి చాలా ఇబ్బంది ఉందని, రాజె 1.5లక్షల హెక్టార్ల ప్రాంతంలో నీటిపారుదల సదుపాయాలు కల్పించారని మోదీ పేర్కొన్నారు. రాజస్థాన్‌లో డిసెంబరు 7న పోలింగ్‌ జరగనుంది. డిసెంబరు 11న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.