ప్రతిఒక్కరూ ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటించాలి

– అదే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం
– పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై నిషేధం విధించే ఆలోచన లేదు
– కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌5  (జనం సాక్షి ):  ప్రతీ ఒక్కరు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని, అదే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. గురువారం సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ 59వ కన్వెన్షన్‌ లో గడ్కరీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై నిషేధం విధించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఈ వాహనాలపై నిషేధం విధిస్తారనే భావన అందర్లో ఉందని, కానీ, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదని చెప్పారు. ఆటోమొబైల్‌ పరిశ్రమ దేశ ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. మన దేశంలో ఆటోమొబైల్‌ సెక్టార్‌ విలువ రూ. 4.50 లక్షల కోట్లుగా ఉందని గడ్కరీ తెలిపారు. దేశంలో కాలుష్యం పెరిగిపోతోందని, ఈ నేపథ్యంలో కాలుష్యం వెదజల్లని ఇంధనం దిశగా వాహన తయారీ పరిశ్రమ అడుగులు వేయాల్సి ఉందని చెప్పారు. వాతావరణ కాలుష్యానికి కేవలం వాహనాలను మాత్రమే నిందించలేమని, అయితే కాలుష్య కారకాల్లో వీటి భాగస్వామ్యం కూడా ఉందని తెలిపారు. ఢిల్లీలోని కాలుష్యంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోందని… వాటిలో మొదటిది దిగుమతి చేసుకుంటున్న క్రూడాయిల్‌ ధరలని చెప్పారు. రెండో స్థానంలో కాలుష్యం, ఆ తర్వాత రోడ్‌ సేప్టీ ఉన్నాయని గడ్కరీ తెలిపారు.