ప్రతి తల్లి తమ బిడ్డకు తల్లిపాలు అందించాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 1 (జనం సాక్షి);

ప్రతి తల్లి తమ బిడ్డకు తల్లిపాలు అందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి కోరారు.
మంగళవారం నాడు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లతో ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు నిర్వహించే ప్రపంచ తల్లి పాల వారోత్సవ కార్యక్రమాలపై పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లి పాల వారోత్సవాల కార్యక్రమాలలో బిడ్డకు తల్లిపాలు ఎంత ముఖ్యమో వివరించాలని, తల్లిపాల సంస్కృతిని పరిరక్షించాలని, ప్రతి తల్లి తమ బిడ్డకు తల్లిపాలు అందించేలా ప్రచార కార్యక్రమాలను అమలు చేయాలని తెలిపారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు అందించడం, మొదటి ఆరు నెలల వయసు వరకు తల్లిపాలు మాత్రమే ఇప్పించేలా చూడడం, ఆరు నెలల తర్వాత అనువైన కుటుంబ ఆహారం తల్లిపాలతో అదనంగా అందించడం తదితర విషయాలపై, పోషణ విధానంపై, పోషకాహార లోపంపై వివరించాలని, తల్లిపాలు కొనసాగించకపోతే కలిగే నష్టాలపై జాగ్రత్తలు చెప్పాలని తెలిపారు.జిల్లాలో 3415 మంది గర్భిణీ స్త్రీలు నమోదయి ఉన్నారని, గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు, తల్లులకు తల్లి పాల ప్రాముఖ్యతపై ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులలో పోస్టర్లు, ఛార్టర్స్ ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, ప్రతి గ్రామంలో అంగన్వాడి, ఆశా, గ్రామపంచాయతీ సిబ్బందితో ర్యాలీలు చేపట్టి ప్రజలందరికీ తెలిసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, జిల్లా, మండల మహిళా సభ్యులతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని,సభల ద్వారా వైద్య , అంగన్వాడీ,ఆశా సిబ్బందితో తల్లిపాలు శిశువులకు ఎంతో అవసరమో చెప్పాలని,అంగన్వాడీ, ఆశా సిబ్బంది గర్భిణీ స్త్రీలు, బాలింతల ఇళ్లకు వెళ్లి తల్లిపాల ప్రయోజనాలపై వివరించాలని, కౌన్సిలింగ్ అందించాలని తెలిపారు.
ఈకార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ముసయిదా బేగం , జిల్లా వైద్యాధికారి డాక్టర్ శశి కళ,నర్సింహా సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

తాజావార్తలు