ప్రత్యక్ష రాజకీయాల్లోకి..ప్రియాంకా గాంధీ


లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాత్మక నిర్ణయం
యూపీ తూర్పు ప్రాంత కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా నియామకం
– ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించనున్న ప్రియాంక
– హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు
– ప్రియాంక చాలా సమర్థురాలని కితాబిచ్చిన రాహుల్‌ గాంధీ
న్యూఢిల్లీ,జనవరి23(జ‌నంసాక్షి): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోడీని ఢీకొనేందుకు కాంగ్రెస్‌ తురుపుముక్క ప్రియాంకను కాంగ్రెస్‌ పార్టీ రంగంలోకి దింపింది. ఆమెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకుని రావడంతో పాటు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. దీంతో ఇంతకాలంఊగిసలాటలో ఉన్న ప్రియాంక రాజకయీ ప్రవేశం ఇప్పుడు అధికారికంగా ఆమోదం పొందింది. మోడీని ఢీకొనడానికి ఇదే మంచి తరుణమని కాంగ్రెస్‌ భావించింది. మరోవైపు యూపిలో ఎస్పీ, బిఎస్పీ పొత్తులు కూడా కాంగ్రెస్‌ నిర్ణయానికి కారణంగ ఆచెప్పుకోవాలి. ఒంటరి పోరుకు సిద్దమైన వేళ ఆమె రాక కాంగ్రెస్‌ను గట్టెక్కిస్తుందని భావిస్తున్నారు. దీంతో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ కుమార్తె, ప్రియాంకగాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయమైంది. ఇప్పటి వరకు అడపాదడపా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న ఆమె ఇప్పుడు నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌ తూర్పు ప్రాంతంలోని కాంగ్రెస్‌ విభాగం జనరల్‌ సెక్రటరీగా ఆమె నియమితులయ్యారు. యూపీ పశ్చిమ భాగంలోని కాంగ్రెస్‌ విభాగం జనరల్‌ సెక్రటరీగా జ్యోతిరాధిత్య సింథియాను నియమించారు. కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ(ఆర్గనైజేషన్‌)గా కేసీ వేణుగోపాల్‌ నియమిస్తున్నట్లు అధిష్ఠానం ప్రకటనను జారీ చేసింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రియాంక గాంధీ తన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ఓ ప్రకటనను విడుదల చేసింది.
యూపీ తూర్పు ప్రాంతానికి భాజపా తరఫు నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రియాంక వాద్రాను ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగానే రంగంలోకి దించారు. ఎన్నికల వేళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ రావడంపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మోతిలాల్‌ వోహ్రా మాట్లాడుతూ.. చాలా కీలక బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించారని అన్నారు. యూపీ తూర్పు ప్రాంతాన్నే కాకుండా ఇతర ప్రాంతాల్లోను ఆమె ప్రభావం కనిపించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రియాంక తన తల్లి, సోదరుడి సొంత నియోజకవర్గాలైన రాయ్‌బరేలి, అమేథి ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో ఆమె పాల్గొన్నారు. అఖిలేశ్‌- మాయావతి పొత్తు నేపథ్యంలో యూపీలో ఎలాగైనా అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని ఉద్దేశంతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ !
ఈస్ట్‌ యూపీకి కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జిగా ప్రియాంకా గాంధీ నియమితురాలైన విషయం తెలిసిందే. అయితే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడంతో.. ఏ స్థానం నుంచి ఆమె పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తల్లి సోనియా గాంధీ నియోజకవర్గమైన రాయ్‌బరేలీ నుంచి కూతురు ప్రియాంకా పోటీకి దిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంకా సీఎం అభ్యర్థిగా పోటీ పడే ఛాన్సు ఉందని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. కానీ ప్రియాంకా తనకు రాజకీయాల విూద ఇష్టం లేదని చెప్పారు. అయితే చాన్నాళ్ల తర్వాత రాజకీయాలపై ఆమె మక్కువ చూపినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు యూపీ ఈస్ట్‌ బాధ్యతలు ప్రియాంకాకు అప్పగించారు. యూపీ ఈస్ట్‌లో కీలకమైన గోరఖ్‌పూర్‌, వారణాసి నియోజకవర్గాలు ఉన్నాయి. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో గోరఖ్‌పూర్‌ నుంచి యూపీ సీఎం ఆదిత్యనాథ్‌, వారణాసి నుంచి ప్రధాని మోదీ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఆదిత్యనాథ్‌ ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఆ స్థానాన్ని కోల్పోయింది. చాలా రిస్కీ బాధ్యతలనే ప్రియాంకాకు అప్పగించినట్లు తెలుస్తోంది. గోరఖ్‌పూర్‌, వారణాసీ సీట్లను టార్గెట్‌ చేయడం అంటే.. ప్రియాంకాతో కాంగ్రెస్‌ పెద్ద సవాల్‌ విసిరినట్లు అర్థమవుతోంది. యూపీలో కాంగ్రెస్‌ కార్యకర్తలకు.. ప్రియాంకాతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. రాహుల్‌ కన్నా ఎక్కువగా స్థానిక కార్యకర్తలు ప్రియాంకాతో అతి సన్నితంగా ఉంటారని కొందరంటున్నారు.
ప్రియాంక చాలా సమర్థురాలు – రాహుల్‌ గాంధీ
తన సోదరి ప్రియాంక చాలా సమర్థురాలని, తనతో కలిసి పని చేస్తారని చెప్పారు.  ఇది తనకు చాలా సంతోషకరమని చెప్పారు. జ్యోతిరాదిత్య సింథియా కూడా చాలా సమర్థుడని చెప్పారు. కాంగ్రెస్‌ సైద్ధాంతిక పోరాటం చేస్తోందన్నారు. ప్రియాంక, జ్యోతిరాదిత్య సింథియా వంటి యువ నేతలతో తాము ఈ పోరాటంలో ముందడుగు వేస్తామన్నామన్నారు. పేదలు, బలహీన వర్గాల కోసం తాము పోరాడుతామన్నారు. తాము ఫ్రంట్‌ ఫుట్‌పై పోరాడతామని తెలిపారు. తాము ఉత్తర ప్రదేశ్‌కు, ఉత్తర ప్రదేశ్‌ యువతకు అవసరమైనవాటి కోసం పోరాడుతామన్నారు. బ్యాక్‌ఫుట్‌ విూద ఆడే పార్టీ తమది కాదన్నారు. ఎక్కడైనాసరే ఫ్రంట్‌ ఫుట్‌పైనే ఆడతామన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఓకొత్త, సానుకూల మార్పు వస్తుందన్నారు.
మాయావతి, అఖిలేశ్‌లను తాను గౌరవిస్తానన్నారు. తమ ముగ్గురి లక్ష్యం ఒకటేనని, అది బీజేపీని ఓడించడమేనని చెప్పారు. మాయావతి, అఖిలేశ్‌లతో తమకు వైరం ఏదీ లేదన్నారు. తమ మధ్య భావసారూప్యత ఉందన్నారు. వారికి సహకరించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
బీజేపీ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్‌ను సర్వనాశనం రాహుల్‌ విమర్శించారు. తాము రాష్ట్రాన్ని బాగు చేస్తామన్నారు. యువత కంటున్న కలలను సాకారం చేస్తామని రాహుల్‌ తెలిపారు.