ప్రధాని మోదీ ‘పూరీ’ నుంచి పోటీచేస్తారు

– 90శాతం అందుకు అవకాశాలున్నాయి
– భాజపా ఎమ్మెల్యే ప్రదీప్‌ పురోహిత్‌
భువనేశ్వర్‌, జనవరి3(జ‌నంసాక్షి) : ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలోని పూరీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని, ఆమేరకు 90శాతం అవకాశాలు ఉన్నాయని భాజపా సీనియర్‌ నేత, ఎమ్మెల్యే ప్రదీప్‌ పురోహిత్‌ వెల్లడించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘మోదీ పూరీ నుంచి
పోటీ చేసే అంశాన్ని ఖండించలేమని తెలిపారు. ఆయన పూరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు
90శాతం అవకాశం ఉందని, ప్రధానికి ఒడిశా ప్రజలంటే ఎంతో ప్రేమ అన్నారు. పూరీతో ఆయనకు మంచి సంబంధాలున్నాయని, అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని తెలిపారు. 2014 ఎన్నికల్లో పూరీ నియోజకవర్గం నుంచి బిజు జనతా దళ్‌ నేత పినాకి మిశ్ర గెలుపొందారు. 50.33శాతం ఓట్లతో ఆయన ఘన విజయం సాధించారు. పూరీ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వాటిలో ఆరు చోట్ల బీజేడీ గెలవగా.. కేవలం ఒక చోట మాత్రమే భాజపా విజయం సాధించింది. 2014లో మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే మోదీ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని భాజపా నేత పురోహిత్‌ చెప్పారు. ఒకవేళ ఆయన పూరీ నుంచి పోటీ చేస్తే.. తాము ఎంతో సంతోషిస్తామని ఒడిశా భాజపా ఉపాధ్యక్షుడు సవిూర్‌ మహంతి అన్నారు. ఈ విషయంపై కేంద్ర నాయకత్వానికి ప్రతిపాదనలు చేస్తామని తెలిపారు. మోదీ మాత్రం మంగళవారమే ఈ వార్తలను ఖండించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇదంతా విూడియా సృష్టే అని పేర్కొన్నారు.