ఫెడరల్‌ ఫ్రంట్‌ ఒక కుట్ర 

– బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చేందుకే కేసీఆర్‌ ప్రయత్నం
– ఫ్రంట్‌ వెనుక అమిత్‌షా, మోడీలున్నారు
– ఏఐసీసీ అధికార ప్రతినిధి రాజీవ్‌గౌడ
హైదరాబాద్‌, డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : ఎన్డీఏ ప్రభుత్వ వ్యతిరేఖ ఓటును చీల్చేందుకే తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ హడావుడి చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి రాజీవ్‌గౌడ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఫ్రెడరల్‌ ఫ్రంట్‌పై విమర్శలు గుప్పించారు. కేవలం ఎన్డీయే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం కేసీఆర్‌ యత్నిస్తున్నారని రాజీవ్‌ గౌడ ఆరోపించారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ వెనుక బీజేపీ, ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలు ఉన్నారని అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికలు దేశానికి ఎంతో కీలకమని… ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాలుగున్నరేళ్లుగా లోక్‌పాల్‌ బిల్లు ఎక్కడికెళ్లిందో మోడీ చెప్పాలన్నారు. సమాచార హక్కు చట్టాన్ని మోడీ, అమిత్‌షా నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. రాఫేల్‌ ధరలను రక్షణమంత్రి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రాఫెల్‌పై కాగ్‌, పీఏసీకి నివేదిక ఇచ్చినట్లు సుప్రీం కోర్టుకు అబద్ధం చెప్పారన్నారు. నాలుగున్నరేళ్ల నుంచి అబద్దాలు, మోసాలతోనే మోడీ పాలన కొనసాగుతోందని విమర్శించారు. దేశరక్షణపై మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే మోడీ ఆరోపణలు చేస్తున్నారన్నారు. మమతాబెనర్జీ గొప్ప లౌకికవాది అని, ఆమె కాంగ్రెస్‌తోనే ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ కూటమే అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలంతా బీజేపీ పాలనతో విసిగిపోయారని, తద్వారా కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయమని నమ్ముతున్నారని రాజీవ్‌గౌడ అన్నారు.