ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌7 ( జనం సాక్షి ) :  కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం మధ్యాహ్నం ఫ్రాన్స్‌ బయలుదేరారు. ఫ్రాన్స్‌ నుంచి భారత వాయుసేన కొనుగోలు చేస్తున్న 36 రాఫెల్‌ యుద్ధ విమానాల్లో తొలి విమానాన్ని స్వీకరించడానికి ఆయన ఈ పర్యటన చేపట్టారు. భారత వాయుసేన ఆవిర్భావ దినోత్సవమైన అక్టోబర్‌ 8న ఫ్రాన్స్‌ భారత్‌కు తొలి రాఫెల్‌ యుద్ధ విమానాన్ని అందజేయనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో రాజ్‌నాథ్‌ పాల్గొని, తొలి రాఫెల్‌ యుద్ధ విమానాన్ని అందుకుంటారు. రాఫెల్‌ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసాల్ట్‌ ఏవియేషన్‌కు చెందిన అధికారులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏటా సంప్రదాయబద్ధంగా జరుపుకునే ‘ఆయుధ పూజ’ను కూడా రాజ్‌నాథ్‌ తన పర్యటన సందర్భంగా ఫ్రాన్స్‌లో జరుపుకొంటారు. రాఫెల్‌ యుద్ధ విమానంలో కొద్దిసేపు విహరిస్తారు. ఫ్రాన్స్‌ ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన ఉన్నత స్థాయి నేతలతో రాజ్‌నాథ్‌ ఈనెల 9న సమావేశమవుతారు. భారత్‌, ఫ్రాన్స్‌ దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారం బలోపేతంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.