బలహీన వర్గాలకు రాజ్యాధికార సాధనే..

చాకలి ఐలమ్మకు మనమిచ్చే ఘననివాళి
– బిసి రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 10(జనం సాక్షి)
వరంగల్ లోని పోచమ్మ మైదాన్ జంక్షన్ లో బీసీ రాజ్యాధికార  సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు చాపర్తి  కుమార్ గాడ్గే నేతృత్వంలో జరిగిన చాకలి ఐలమ్మ 37 వ వర్ధంతి కార్యక్రమానికి బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్ ముఖ్య అతిధిగా విచ్చేసారు.. పూలమాలలతో  ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు..  బలహీన వర్గాలకు రాజ్యాధికారమే చాకలి ఐలమ్మకు మనమిచ్చే ఘన నివాళి అంటూ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సామూహికంగా నినాదాలు చేశారు..
తదనంతరం బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్  దాసు సురేశ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, భూమి కోసం భుక్తి కోసం దొరల పాలన నుండి విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటాలు తెలంగాణ చరిత్రకే వన్నె తెచ్చాయని కొనియాడారు..పెత్తం దార్లతో , జమీందార్లతో , నిజాం సర్కారుతో  ఏ మాత్రం వెరవకుండా పోరాడి నిజాం చెర నుండి హైదరాబాద్ రాష్ట్రాన్ని విముక్త్తం చేయడంలో ఐలమ్మ ముఖ్య భూమిక పోషించిందన్నారు..
బలహీనులు రాజ్యమేలడం కోసమే ఐలమ్మ తిరుగుబాటు బావుటా ఎగరేసిందన్న  విషయాన్ని నేటి పాలకులు గుర్తెరగాలన్నారు..
కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో తనకు సహకరించిన అగ్ర వర్ణాలకు  ,పెట్టుబడి దారులకు మాత్రమే పట్టం కడుతూ,వారికి రాష్ట్ర సంపదను దోచి పెడుతూ అప్పుడప్పుడు రాష్త్రం నుండి నిధులను పక్క రాష్ట్రాలకు సైతం తరలిస్తూ పేద ప్రజల నోట్లో మట్టి కొడుతున్నాడని దాసు సురేష్ మండి పడ్డారు.
మరోపక్క కేంద్ర ప్రభుత్వ పాలన “నన్ను నమ్ముకో – ఉన్నది అమ్ముకో” అనే  చందంగా కొనసాగుతున్నదని మండిపడ్డారు .. రాత్రికి రాత్రే EWS రిజర్వేషన్లు చట్టబద్దం చేయడం దేనికి నిదర్శనమని కేంద్రాన్ని ప్రశ్నించారు..పెట్టుబడి దారులకు తొత్తులుగా ప్రభుత్వాలు మారాయన్నారు.. కేంద్రం టాక్సుల మోతతో, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో  పేదోళ్ల నడ్డి విరుస్తుందని వాపోయారు.. ప్రైవేటీకరణతో బలహీన వర్గాల రిజర్వేషన్లు ,ఉద్యోగాలు ఆవిరి అయి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ..
దేశంలో పేదరికం మాత్రమే వెనుకబాటు తనం కాదనీ .,సామాజిక రుగ్మతలు , ఆత్మ గౌరవ సమస్యలు సైతం వెనుకబాటు తనానికి సూచికలేనని పేర్కొన్నారు..ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం పరిగణన లోకి తీసుకొని  వెంటనే బీసీల జనాభాను అనుసరించి ( బీసీ జనగణన గావించి ) వారికి ఆర్ధిక వనరులు , విద్య , వైద్య , రాజకీయ రంగాల్లో సముచిత ప్రాధాన్యత దక్కే విధంగా పార్లమెంటులో చట్టాలు తేవాలన్నారు..ఈ  కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి వరంగల్ ముఖ్య సమన్వయ కమిటీ సభ్యులు
సట్ల రామనాధం , గాజు యుగేందర్
యాదవ్, ఆడెపు నగేష్,, దామరకొండ కొమురయ్య, పైండ్ల బిక్షపతి, అడ్వకేట్ రాచకొండ ప్రవీణ్, నెల్లుట్ల విరస్వామి, పోయిన యాకయ్య,  రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు..