బాబు, షర్మిల తెలంగాణ వ్యతిరేకం కాకపోతే మీ కార్య చరణ ఏందీ? తెలంగాణ కోసం దీక్ష చేస్తారా! కోదండరాం
హైదరాబాద్: తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ పాదయాత్రలు చేస్తున్న చంద్రబాబు, షర్మిల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కార్య చరణ ప్రకటించాలని, తెలంగాణ కోసం దీక్షలకు సిద్దమేనా? అని ప్రొ. కోదండరాం ప్రశ్నించారు. ‘ తెలంగాణ దీక్షా దివస్ ‘ సందర్భంగా ఇందిరపార్కు వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రొ. కోదండరాం మాట్లాడారు. గులాంనబీ ఆజాద్, వాయలార్ రవి, మనీష్ తివారితో పూటకో మాట మాట్లాడిస్తూ తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చావు తెగించి ఆమరణ దీక్షచేసి కేంద్రం మెడలు వంచి తెలంగాణకు అనుకూల ప్రకటన వచ్చేలా చేశాడని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణ సమాజం మొత్తం కదలిందని ఇక తెలంగాణ సాధించేవరకు పోరాటాన్ని ఆపేదిలేదన్నారు.