బిజెపి అధ్యక్షరేసులో రాంమాధవ్‌?

జెపినడ్డా, ప్రధాన్‌లతో పాటు పోటీలో మాధవ్‌

ఆర్‌ఎస్‌ఎస్‌కు అత్యంత ప్రీతిపాత్రుడిగా పేరు

న్యూఢిల్లీ,మే30(జ‌నంసాక్షి): దేశంలో అధికారంలోకి రావడంలో రెండుసార్లు విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్‌ షా స్థానాన్ని అందుకోవడం అంత సామాన్యమైన,సులువైన విషయం కాదు. పార్టీలో అంతటి శక్తీ, సామర్థ్యాలు ఉన్న సమర్థవంతమైన నేత కోసం కమళదళం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ పేరును ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా పరిశీలిస్తోందని సమాచారం. గతంలో ఎందరో ఈ పదవిని అధిష్టించినా, అమిత్‌షా లాగా పార్టీని విజయతీరాలకు తీసుకుని వెళ్లడంలో వ్యూహాలు రచించలేదు. అయితే అమిత్‌షా కేంద్రమంత్రి వర్గంలో చేరడం ఖాయమే అయినా, ఆయన కనుసనన్నల్లోనే పార్టీ నడుస్తుందని స్‌ష్టం అవుతోంది. ఆయన అప్రకటిత అధ్యక్షుడిగా ఉంటూ మార్గనిర్దేశం చేస్తారు. అయితే ప్రకటిత బిజెపి అధ్యక్షుడిగా ఎవరున్నా ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లోనే ఉంటారు. ఆర్‌ఎస్‌ కూడా సమర్థ నేతను ఎంచుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఎంపికలో ముందు వరుసలో.. ఆ పార్టీ ఎంపీ జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రథాన్‌ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన

అనుభవం జేపీ నడ్డాకుంది. అలాగే ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌గా నడ్డా బాధ్యతలు చేపట్టి.. 62 ఎంపీ స్థానాల్లో గెలుపుకు కృషిచేశారు. అలాగే ధర్మేంద్ర ప్రథాన్‌పై కూడా బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. దక్షిణంలో అంత ప్రభావం లేకపోయినా 2014, 2019 ఎన్నికల్లో ఒడిశాలో పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రథాన్‌. 2014కు ముందు ఆ పార్టీకి కేవలం 21 శాతం ఓట్‌ బ్యాంకు ఉంటే దానిని 2019 వరకు 39శాతం వరకు తీసుకురాగలిగారు. దీంతో వీరిద్దరిలో ఒకరికి జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. పార్టీలోని సీనియర్ల పేర్లను కూడా పరిశీస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు వ్యక్తి ప్రస్తుం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాంమాధవ్‌ పేరు కూడా తాజాగా జాబితాలో చోటుచేసుకుంది. వ్యూహాలు రచించి అమలు చేయడంలో ఆయన కూడా దిట్ట అన్న పేరుంది. తెలంగాణలో నాలుగు సీట్లు రావడంలో రాంమాధవ్‌ కృషి కూడా ఉంది.

సార్వత్రిక ఎన్నికల్లో 303 లోక్‌సభ స్థానాలతో ఘన విజయం సాధించిన బీజేపీ.. కేంద్రంలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ విజయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అద్వానీ ప్రాతినిధ్యం వహించిన గాంధీ నగర్‌ నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలకు రాజీనామా చేసి.. ఆయన స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కొత్త అధ్యక్షడు ఎవరని ఆ పార్టీలో తీవ్ర చర్చజరుగుతోంది. బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించాలో షా మోడీతో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీకి షా నీడలా ఉంటూ కొత్తవారితో ముందుకు నడిపిస్తారని సమాచారం. అదే నిజమైతే నడ్డా, ప్రధాన్‌లతో పాటు రాంమాధవ్‌ కూడా పోటీలో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.