బిల్లును అడ్డుకుంటే..  దేశ వ్యతిరేకులమా?

– తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్ర
న్యూఢిల్లీ, జులై24(జ‌నంసాక్షి) : బిల్లును అడ్డుకుంటే దేశద్రోహులని కేంద్ర ముంద్ర వేస్తుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్ర అన్నారు. బుధవారం పార్లమెంట్‌లో యూఏపీఏ (ద అన్‌లాఫుల్‌ యాక్టివిటీస్‌(ప్రివెన్షన్‌) అమెండ్‌మెంట్‌) బిల్లుపై చర్చ జరిగింది. అయితే ఈ బిల్లును తృణమూల్‌ కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. సభలో ఆ పార్టీ తరపున ఎంపీ మహువా మొయిత్ర మాట్లాడారు. బిల్లును వ్యతిరేకిస్తే ఎందుకు ప్రతిపక్షాలను దేశవ్యతిరేకులని ఆరోపిస్తున్నారని మొయిత్ర అన్నారు. తృణమూల్‌ ఏ బిల్లును అడ్డుకున్నా.. అప్పుడు తమల్ని దేశవ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని ఆమె అన్నారు. జాతీయ భద్రతా అంశాలపై అంగీకారం తెలుపకపోతే మేం దేశ వ్యతిరేకులం అవుతామా అని ఆమె ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం ట్రోల్‌ ఆర్మీలతో దాడి చేస్తోందని ఆమె విమర్శించారు. ఎటువంటి విచారణ చేపట్టకుండానే ఓ వ్యక్తిని ఉగ్రవాదిగా ఎలా చిత్రీకరిస్తారని ఆమె బిల్లుపై అసహనం వ్యక్తం చేశారు. రాష్టాల్ర అధికారాలను బిల్లు కాలరాస్తోందన్నారు. యూఏపీఏ బిల్లు.. ప్రజలకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందన్నారు.