బీజేపీ ఎంపీ శతృఘ్నసిన్హాకు షాక్‌

ఇష్టం లేకుంటే పార్టీని వీడి వెళ్లవచ్చు

బీహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ సలహా

పాట్నా,జనవరి17(జ‌నంసాక్షి): నిత్యం స్వపక్షంపైనే విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ ఎంపీ, బాలీవుడ్‌ ప్రముఖ నటుడు శతృఘ్నసిన్హాకు గట్టి షాక్‌ తగిలింది. పార్టీలో ఉంటూ విమర్శలు చేసే బదులు ఇష్టం లేకపోతే బయటకు వెళ్లి పోవచ్చని ఆ పార్టీకి చెందిన బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోడి సంచలన సలహా ఇచ్చారు. బీజేపీ అంటే ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వైదొలగాలని సుశీల్‌ కుమార్‌ సలహా ఇచ్చారు. మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హాతో స్నేహం వల్లనే శతృఘ్నసిన్హా ఇలా విమర్శలు గుప్పిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఒక టీవీ ఛానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో మోడి మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుడిగా మారిన సినీనటుడు శతృఘ్నసిన్హా వాస్తవంగా బీజేపీ తిరుగుబాటుదారుడిగా మారి, తన సొంత పార్టీ బహిరంగ వేదికల నుంచి వైదొలిగారని మోడీ చెప్పారు. పెరుగుతున్న ఇంధన ధరలు, నోట్ల రద్దు, రాఫెల్‌ ఒప్పందం, విజయ్‌ మాల్యా కేసు వంటి అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా లక్ష్యంగా పెట్టుకొని శతృఘ్నసిన్హా వ్యాఖ్యలు చేశారని సుశీల్‌ కుమార్‌ పేర్కొన్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా నియమించి, రెండుసార్లు లోక్‌సభ సీటు, కేంద్రమంత్రి పదవి ఇచ్చిన బీజేపీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్న శతృఘ్నసిన్హా పార్టీని విడిచిపెట్టాలని సుశీల్‌ కుమార్‌ కోరారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అంశాల్లో సిన్హా చేసిన విమర్శలు బీజేపీ పార్టిని ఇబ్బందిలో

పడేశాయని, ఆయన ప్రతిపక్ష నాయకుడైన లాలూ ప్రసాద్‌ను కలవడమే కాకుండా అతని కుమారుడు బీహార్‌ సీఎం అవుతాడని వ్యాఖ్యానించడం సమంజసం కాదని సుశీల్‌ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బీజేపీ నేతలు నంద్‌ కిషోరి యాదవ్‌, సంజీవ్‌ చౌరాసియా, అరుణ్‌ కుమార్‌ సిన్హా, నిత్సిన్‌ నవీన్‌ ల కృషి వల్ల శతృఘ్నసిన్హా విజయం సాధించాడని సుశీల్‌ చెప్పారు. శతృఘ్నసిన్హా పార్టీ వదిలివెళితే, పార్టీ నిర్ణయిస్తే తాను పాట్నా సాహిబ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని సుశీల్‌ చెప్పారు. తాను బీజేపీలోనే పుట్టి బీజేపీలోనే మరణిస్తానని సుశీల్‌ ప్రకటించారు.