బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుంది

– జగన్‌కు విజయసాయి గుదిబండలా మారాడు
– అక్రమాలుంటే కూల్చండి.. రాజకీయ కక్షలు వీడాలి
– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌27  (జనంసాక్షి):  ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి విజయసాయిరెడ్డి గుదిబండలా మారాడని, రాజకీయ కక్షలతో పాలన సాగించడం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, జగన్‌
సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో బీజేపీ వైఖరిపై ఆయన దుమ్మెత్తిపోశారు. కాషాయ పార్టీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. బీజేపీలో చేరితే గంగిగోవు.. లేకపోతే దేశద్రోహి అన్నట్టు దేశంలో ప్రస్తుత పరిస్థితి ఉందని ఎద్దేశా చేశారు. పశ్చిమ్‌ బెంగాల్‌లోని శారదా చిట్స్‌ కుంభకోణం కేసును ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కేసులో ఐదుగురు ఆరోపణలు ఎదుర్కొంటే వారిలో ముకుల్‌రాయ్‌ బీజేపీలో చేరారని, ఆయన్న మినహాయించి మిగతావారిపై సీబీఐ ఛార్జిషీట్లు దాఖలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతి ప్రాంతంలో కరకట్టపై నిర్మాణాల కూల్చివేత, గ్రామ వాలంటీర్‌ ఉద్యోగాలలో 90 శాతం వైఎస్‌ఆర్సీపీ కార్యకర్తలేనని విజయసాయిరెడ్డి అన్న వ్యాఖ్యలపై నారాయణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతికూల రాజకీయాలు వీడాలని హితవు పలికారు. నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చివేయాలి తప్ప రాజకీయ కక్ష సాధింపుతో చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే కోడెలపై కేసులు పెట్టాలని ట్వీట్లు చేయడం.. ఉద్యోగాల్లో 90శాతం మనవాళ్లే అనడం ద్వారా సీఎం జగన్‌కు విజయసాయిరెడ్డి గుదిబండగా మారారని నారాయణ అభిప్రాయ పడ్డారు. జగన్మోహన్‌రెడ్డి ప్రజాపాలను సాగించాలని, అలా కాకుండా రాజకీయ కక్షలతో పాలన సాగించాలని చూస్తే ఆయనకు ఓట్లేసిన ప్రజలే తిరగబడుతారని అన్నారు.