బెంబేలెత్తిస్తున్న కొత్త వాహన చట్టం

ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్న చలానాలు
న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టానికి పదను పెట్టడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.  సవరణలతో విధిస్తున్న జరిమానాలకు హద్దే లేకుండా పోతోంది. ఇవేం జరిమానాలు అంటూ వాహన చోదకులు వాపోతున్నారు. రవాణా శాఖలైతే పోటాపోటీగా జరిమానాలు విధిస్తూ కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కర్నాటక, పంజాబ్‌,హర్యానాల్లో అత్ధికంగా వసూళ్లు సాగుతున్నాయి. దాదాపు రెండుకోట్లకు పైగా జరిమానాల రూపంలో వసూళ్లు జరిగియాని ఓ అంచనా. మొత్తంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే హాట్టాపిక్‌గా మారింది. ఓ టూ వీలర్‌ దారుడు ఇటీవల చలానా కట్టలేక బండిని తగులబెట్టడం పరాకాష్టగా చూడాలి.  ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లాలో అశోక్‌ జాదవ్‌ అనే ఒక ట్రక్‌ డ్రైవర్‌కు ఆ రాష్ట్ర రవాణా శాఖ ఏకంగా రూ.86,500 జరిమానా విధించింది. దేశంలో ఇప్పటికి ఇదే అత్యధికం. ఈ నెల 3న అశోక్‌కు జరిమానా
విధించినప్పటికీ..దానికి సంబంధించిన చలానా సోషల్‌ విూడియాలో చక్కర్లు కొడుతోంది. అనధికార వ్యక్తిని డ్రైవింగ్‌కు అనుమతించినందుకు రూ.5 వేలు, లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌ చేసినందుకు మరో రూ.5వేలు, 18 టన్నుల కంటే ఎక్కువ రవాణా చేస్తున్నందుకు రూ.56 వేలు, ఓవర్‌ డైమెన్షన్‌ ప్రొజెక్షన్‌కు గాను ఇంకో రూ.20 వేలు, సాధారణ జరిమానా రూ.500తో కలిపి మొత్తం రూ.86,500 అశోక్‌కు జరిమానా విధించినట్లు సంబల్‌పూర్‌ ప్రాంతీయ రవాణా అధికారి లలిత్‌ మోహన్‌ బెహరా తెలిపారు. దీంతో బెంబేలెత్తిపోయిన అశోక్‌ జాదవ్‌ అధికారుల కాళ్లావేళ్లా పడినా ఫలితం పెద్దగా లేకపోయింది. చేసేదేవిూ లేక రూ.86,500కు గానూ రూ.70 వేలు చెల్లించారు. నాగాలాండ్‌లోని బిఎల్‌ఎ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ఆ ట్రక్కు…జెసిబి మిషన్‌ను అంగూల్‌ జిల్లాలోని తల్చేర్‌ నుండి చత్తీస్‌గఢ్‌కు తీసుకువెళుతుండగా సంబల్‌పూర్‌ అధికారులు పట్టుకున్నారు. మోటారు వాహన చట్టం (సవరణ) అమలు చేసిన రాష్టాల్లో ఒడిశా కూడా ఒకటి. తొలి నాలుగురోజుల్లో ఈ చట్టాన్ని అమలు చేయడం ద్వారా రూ.88 లక్షలు జరిమానాల రూపంలో వసూలు చేసి..దేశంలో అత్యధికంగా వసూలు చేసిన రాష్ట్రంగా కూడా ఒడిశా నిలవడం విశేషం. సరైన డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని, రిజిస్టేష్రన్‌, ఇన్య్సూరెన్స్‌ సర్టిఫికెట్లు లేకపోవడం, అదేవిధంగా మద్యం సేవించి వాహనాన్ని నడిపారన్న కారణంగా భువనేశ్వర్‌లోని ఓ ఆటో డ్రైవర్‌ నుండి రూ.47,500ను జరిమానా రూపంలో రవాణా శాఖ అధికారులు వసూలు చేశారు. దీనిపై సర్వతత్రా విమర్శలు వస్తుండటంతో మోటారు వాహన సవరణ చట్టం 2019 అమలులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది.
లారీ డ్రైవర్లకు డ్రెస్‌ కోడ్‌
లారీ డ్రైవర్లు లుంగీతో డ్రైవింగ్‌ చేస్తే రూ.2000 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇకపై డ్రెస్‌ కోడ్‌ పాటించని లారీ డ్రైవర్లకు జరిమానాలు విధించాలని యూపీ సర్కారు నిర్ణయించింది. కొత్త మోటారు వాహనాల చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో వాణిజ్య వాహనాలు నడిపే డ్రైవర్లు డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరిగా పాటించాలని సర్కారు ఆదేశించింది. వాణిజ్య వాహనాలు, లారీలు నడిపే డ్రైవర్లు ఫుల్‌ సైజు ప్యాంటు షర్టు యూనిఫాంతోపాటు షూ తప్పనిసరిగా ధరించాలని కొత్త మోటారు వాహనాల చట్టం నిర్దేశిరచింది. డ్రెస్‌ కోడ్‌ ను డ్రైవర్లు ఉల్లంఘిస్తే 1989 మోటారువాహనాల చట్టం ప్రకారం 500 రూపాయల జరిమానా ఉండేది. ప్రస్తుత కొత్త చట్టం 2019 ఎంవీ యాక్ట్‌ ప్రకారం డ్రైవర్లు లుంగీ ధరించి డ్రైవింగ్‌ రెండువేల రూపాయల జరిమానా విధిస్తున్నామని యూపీ అదనపు రవాణ శాఖ కమిషనర్‌ యూపీ గంగాఫల్‌ చెప్పారు.