బొగ్గు స్కాంతో మసిబారిన పార్లమెంట్ ప్రతిష్ట
దుమ్మెత్తి పోసిన విదేశీ పత్రికలు
ఉభయ సభలు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7 (జనంసాక్షి) :
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ‘బొగ్గు’ మంటల్లో మసకబారాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఎలాంటి చర్చ జరగకుండానే 13 రోజుల పాటు సమావేశాలు వృథా అయ్యాయి. . 8న సమావేశాలు ప్రారభ మైన సమయంలో.. బ్యాంకింగ్ చట్టాల బిల్లు, ఇన్సూరెన్స్ బిల్లు లాంటి ఆర్థిక బిల్లులతో సహా 30 కీలక బిల్లులను ప్రభుత్వం ఎజెండాలో చేర్చించింది. కానీ, వీటిలో ఏ ఎక్కదానిపైనా సభలో చర్చ జరగలేదు. విద్యా సంబంధ బిల్లులు కూడా చర్చకు రాలేదు. ఎయిమ్స్ బిల్లు, మహిళా వేధింపుల నిరోధక బిల్లు సహా కేవలం ఆరు బిల్లులు మాత్రమే ఆమోదం పొం దాయి. 15 బిల్లులను ప్రవేశపెట్టాల్సి ఉండగా.. కేవలం ఐదింటిని మాత్రమే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ పదోన్నతుల బిల్లు కూడా కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోయింది. ఈ విషయంపై విదేశీ పత్రికలు దుమ్మెత్తి పోశాయి.108 గంటల పాటు లోక్‌సభ సమావేశాలు జరగాల్సి ఉండగా.. కేవలం 24 గంటలే పాటే సాగాయి. 90 గంటల పాటు సమావేశాలు కొనసాగాల్సి ఉండగా.. కేవలం 26 గంటలు మాత్రమే సమావేశమైంది. సమావేశాలు స్తంభించడానికి కారణం ప్రతిపక్షాలేనని… దేశ ప్రజలకు వారే సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ అన్నారు. మరోవైపు, ఆయన వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది. ప్రభుత్వం జవాబుదారీ వహించేందుకు మాత్రమే తాము యత్నించామని ఆ పార్టీ నేత స్మృతి ఇరాని తెలిపారు.
దురదృష్టవశాత్తు 1952 నుంచి ఎక్కువ సార్లు వాయిదా పడిన సభగా 15వ లోక్‌సభ రికార్డులకెక్కనుంది. మరోవైపు, సభా నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన సుశీల్‌కుమార్ షిండే తన పాత్రను సమర్థవంతంగా పోషించడంలో విఫలమయ్యారు.
నెల పాటు సాగిన వర్షాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. అత్యంత తక్కువ సభా కార్యకలాపాలు జరిగిన సమావేశాలుగా ఈ వర్షాకాలు సమావేశాలు రికార్డుకెక్కాయి. సోనియా ఆగ్ర¬ద్రురాలవ్వడం, సభ్యులు దురుసుగా ప్రవర్తించడం, 13 రోజుల పాటు వరుసగా ఉభయ సభలు స్తంభించడం.. తదితర పరిణామాలు ఈ సమావేశాల్లో చోటు చేసుకున్నాయి. రెండు వారాలుగా సభను అడ్డుకోవడం వల్ల రూ.10 కోట్ల మేర వృథా అయ్యాయి. మరోవైపు, పార్లమెంట్ సమావేశాలు మట్టిగొట్టుకుపోవడానికి విూరంటే విూరే కారణమంటూ ప్రభుత్వ, ప్రతిపక్షాలు ఆరోపణలు చేసుకున్నాయి. ‘ఇదే అన్నింటికంటే పెద్ద కుంభకోణం.
పార్లమెంట్ సమావేశాల కోసం ప్రతి నిమిషానికి ప్రభుత్వం రూ.30 వేలు ఖర్చు చేస్తోంది. అయినా మనం ఏమాత్రం పని చేయడం లేదు. కార్యకలాపాలు సాగకుండా అడ్డుకుంటే ఎలా?’ కేంద్ర మంత్రి అంబికా సోని ప్రశ్నించారు.
మరోవైపు, ఈ సమావేశాలు ఏమాత్రం పని చేయలేదని గుర్తుండిపోతాయని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ హవిూద్ అన్సారీ అన్నారు. పదోన్నతుల బిల్లుపై చర్చ సందర్భంగా ఇద్దరు ఎంపీలు తోపులాటకు దిగిన ఉదంతం ఈ సమావేశాల్లోనే చోటు చేసుకోవడం గమనార్హం. గతేడాది డిసెంబర్‌లో జరిగిన శీతాకాల సమావేశాలే ఇప్పటివరకు అత్యంత వృథా అయిన సమావేశాలుగా చరిత్రకెక్కాయి. 2జీ కుంభకోణంపై ఉభయ సభలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా వరుసగా వాయిదా పడ్డాయి. టేబుల్‌లో ఉన్న లోక్‌పాల్ బిల్లు కూడా ఆమోదం పొందలేదు.