బ్యాంకుల విలీనంతో మొండి బకాయిలు వచ్చేనా?

రాజకీయ జోక్యం కారణంగానే ఎన్‌పిఎల గుదిబండ
ఆ వైపు ఆలోచంచిలేక పోతున్న ప్రభుత్వం
ముంబై,సెప్టెంబర్‌5(జనం సాక్షి ): ఆర్థిక రంగం నుంచి రోజుకో ప్రమాద ఘంటిక వినిపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం పది జాతీయ బ్యాంకుల్ని విలీనం చేసి, వాటిని నాలుగు బ్యాంకులుగా కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 12కి తగ్గింది. బ్యాంకుల విలీనం చర్య పూర్తిగా నిరర్థకమైనదని ఎవరూ అనకున్నా, విలీనం చేయక తప్పని పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయో గమనించాలి. విలీనం వల్ల తక్షణ ఉపయోగాలేంటో గమనించాలి. అలా ఆలోచించినట్టు కనబడడం లేదు. అలా ఆలోచించి ఉంటే బ్యాంకుల రుణవితరణలో రాజకీయ జోక్యం ఎప్పుడో ఆవిరయ్యేది. అది లేకపోబట్టే బ్యాకులు నిస్సహాయ స్థితిలో పడ్డాయి. గతంలో బ్యాంకులకు విపరీతంగా లైసెన్సులుఇచ్చి, ఇప్పుడేమో విలీనాలను చేపట్టడంఎంతవరకు సమంజసమో కూడా ఆలోచించాలి. బ్యాకులపై రాజకీయ జోక్యం కారణంగానే అవి స్వతంత్రను కోల్పోతున్నాయి. మొండి బకాయిలు పెరుగుతున్నాయి.  మాల్యా, నీరవ్‌ మోడీలు వేలకోట్లు ముంచడం వెనక రాజకీయ ప్రమేయం ఖచ్చితంగా ఉండివుంటుంది. ఈ విలీనం వల్ల బ్యాంకుల పనితీరు మెరుగుపడటంతోపాటు వాటి నిర్వహణ వ్యయాలు తగ్గుతాయని, అవి పెద్ద వ్యాపార సంస్థలకు అప్పు లిచ్చే స్తోమత సంతరించుకుంటాయని, మొండి బాకీల సమస్యను అధిగమించగలుగు తాయని అంటున్నారు. వృద్ధికి ఊతం వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. వీటితోపాటు బహిరంగ మార్కెట్‌లో వాటికి నిధులు సేకరణ కూడా ఇకపై సులభమవుతుందని అంటున్నది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా గత 20 ఏళ్లుగా బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకోవడం, ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టడం అనే ధోరణి పెరిగింది. రఘురాం రాజన్‌ రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌గా పని చేసినప్పుడు ఇలాంటి ఎగవేతదార్ల నుంచి బ్యాంకులకు దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నదని ప్రకటించారు. బ్యాంకు ఎగవేతదారుల జాబితా ప్రకటించాలని గతంలో ఓ మారు సుప్రీం సూచించినా ఎందుకనో ముందుకు రాలేదు. అంతక్రితం యూపీఏ ప్రభుత్వమైనా, ఇప్పుడు ఎన్‌డీఏ ప్రభుత్వమైనా ఆ మాదిరి చర్యకు ఉపక్రమించిన సూచనలు లేవు. రాజకీయ ఒత్తిళ్లతో వెనకా ముందూ చూడకుండా రుణాలిచ్చి నిస్సహాయ స్థితిలో పడిన బ్యాంకులు ఓ పెద్ద బ్యాంకులో విలీనం కావడం వల్ల ఆ బరువు బదిలీ అవుతుంది తప్ప మాయం కాదు. కనుక విలీనం కన్నా ముందు ఆ రుణాలిచ్చే తీరును మార్చడం, బకాయిలను రాబట్టుకోవడానికి కఠిన చర్యలకు ఉపక్రమించడం అత్యవసరంగా గుర్తించాలి. బడా వ్యాపారవేత్తలకు రుణాలు ఇవ్వడంవల్లచిన్న వ్యాపారుల విషయం వచ్చేసరికి మొండిచేయి చూపుతున్నారు. నిర్దిష్ట శాతానికి మించి బకాయిలున్న బ్యాంకులు కొత్తగా రుణాలివ్వరాదని ఆంక్షలు పెట్టడంతో వాటి వ్యాపారం స్తంభించిపోయింది. ఇలా వృత్తిగత నైపుణ్యంతో స్వేచ్ఛగా, స్వతంత్రంగా మదింపు వేసుకునే అవకాశం బ్యాంకులకు ఉంటే వాటిమధ్య వ్యాపారపరమైన పోటీ పెరుగుతుంది. శరవేగంతో అవి విస్తరించగలుగుతాయి. ఇప్పుడు ఆర్థికమాంద్యం ముంచుకొస్తున్న వేళ విలీనం సాహసమనే చెప్పాలి. ఈ పక్రి యంతా పూర్తికావడానికి ఆర్నెల్ల నుంచి ఏడాది కాలం పడుతుందంటున్నారు. ఈ కాలమంతా ఆ బ్యాంకులు తమ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించలేవు. రుణ వితరణ ద్వారా మార్కెట్‌ పుంజుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన సమయంలో ఇంత పెద్ద పక్రియను చేపట్టడం అర్థంకాని చర్యగా చూడాలి. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఒక వైపు బ్యాంకింగ్‌ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని చెబుతున్నారు. దానిని పటిష్ట పర్చడానికేనంటూ పలు చర్యలు ప్రకటిస్తున్నారు. అదే సమయంలో మన బ్యాంకుల పని తీరులో మెరుగుదల లేకపోగా గతం కంటే క్షీణత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని ఆ రంగానికి శిఖర ప్రాయమైన రిజర్వు బ్యాంకు తాజాగా మరొక్కసారి కుండ బద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పింది. బ్యాంకులలో మోసాల సమస్యను తొలగించాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అది ఏటికేడాదీ పెరిగి పోతున్నదని ఆర్‌బిఐ  సమర్పించిన తాజా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. మోసాలలో చిక్కుకున్న బ్యాంకుల సొమ్ము ఒక్కసారిగా 73.8 శాతం పెరిగిందని వెల్లడించింది. దీనికి తోడు ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాల (ఏప్రిల్‌ జూన్‌) కాలంలో స్థూల దేశీయ వృద్ధి రేటు 5.8 నుంచి 5 శాతానికి పడిపోయిందన్న తాజా సమాచారం మన ఆర్థిక దుస్థితిని చాటింది.