భాజపా స్వార్థమే నెగ్గింది

– కర్ణాటక వ్యవహారంపై ట్విటర్‌లో రాహుల్‌ గాంధీ
న్యూఢిల్లీ, జులై24(జ‌నంసాక్షి) : కర్ణాటకలో కుమార స్వామి ప్రభుత్వం కుప్ప కూలడంపై కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, శశి థరూర్‌ ఈ అంశంపై ట్వీట్లు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే.. ఆ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కుట్రలు పన్నారని భాజపాపై మండిపడ్డారు. తాజా పరిస్థితిపై వారు ట్వీట్‌ చేశారు. ‘కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచి ఇంటా బయటా వారిని లక్ష్యంగా చేసుకున్నారని, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఒక ముప్పుగా వారు భావించారని, వారి స్వార్థమే గెలిచిందని, ప్రజాస్వామ్యాన్ని, నిజాయతీ గల ప్రభుత్వాన్ని కర్ణాటక ప్రజలు కోల్పోయారని రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. అన్నింటినీ డబ్బుతో కొనలేమని ఏదో ఒకరోజు భాజపా తెలుసుకుంటుందని ప్రియాంక ట్వీట్‌ చేశారు. ప్రతిఒక్కరినీ మోసం చేయడం కుదరదని, ప్రతి అబద్దాన్ని ప్రజలపై రుద్దలేరని వారికి తెలిసి వస్తుందని ఆమె ట్వీట్‌ చేశారు.
దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ కూడా ట్వీట్‌ చేశారు. పశువుల వేలాన్ని నిషేధించిన పార్టీ అని,  కర్ణాటకలో మాత్రం దాన్ని అమలు చేసింది.. తుదికంటా పోరాడిన డీకే శివకుమార్‌, ఇతర కాంగ్రెస్‌ నేతల ధైర్యాన్ని, సిద్దాంతాలను నేను గౌరవిస్తున్నానన్నారు. దీనినుంచి త్వరగా బయటపడాలని ట్విటర్‌లో పేర్కొన్నారు. 14నెలలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ – జనతాదళ్‌ సంకీర్ణ ప్రభుత్వం మంగళవారం కుప్పుకూలిన విషయం తెలిసిందే. విశ్వాస తీర్మానంపై మంగళవారం రాత్రి స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ ఓటింగ్‌ నిర్వహించారు. తగిన సంఖ్యాబలం లేని సంకీర్ణ ప్రభుత్వం ఆరు ఓట్ల తేడాతో ఓటమి పాలైంది.