భారతీయ జనతా పార్టీ తీరుకి వ్యతిరేకం ఓట్లు : మమత

కోల్‌కతా (పశ్చిమ్‌ బంగా): ప్రజలు భారతీయ జనతా పార్టీ తీరుకి వ్యతిరేకంగా ఓట్లు వేశారని పశ్చిమ్‌ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్న విషయం తెలిసిందే. భాజపా అధికారంలో ఉన్న రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ అధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో కొన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక మిజోరం, తెలంగాణల్లో భాజపాకి అంతగా ఆదరణ లేదు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందిస్తూ… ‘ప్రజలు భాజపాకి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇది దేశ ప్రజల తీర్పు, గెలుపు.. ప్రజాస్వామ్య గెలుపు. అన్యాయం, దాడులు, వ్యవస్థల విధ్వంసం, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం… పేదలు, రైతులు, యువత, దళితులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల కోసం ఏమీ చేయని పాలనపై గెలుపు’ అని ఆమె ట్వీట్‌ చేశారు.